-
-
Home » Andhra Pradesh » Prakasam » Covid stop for NRIS
-
ప్రవాస భారతీయులకు కొవిడ్ కట్టడి!
ABN , First Publish Date - 2020-12-27T06:53:53+05:30 IST
ప్రవాస భారతీయులకు కొవిడ్‌ఆంక్షలు కట్టడిలా మారాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

97 మంది రాక, 87 మంది గుర్తింపు
73 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు
13మందికి నెగెటివ్
ఫలితాలు రావాల్సిన వారు 60మంది
అప్పటి వరకూ హోంక్వారంటైన్‌లోనే
ఒంగోలు (కార్పొరేషన్) డిసెంబరు 26 : ప్రవాస భారతీయులకు కొవిడ్‌ఆంక్షలు కట్టడిలా మారాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందస్తుగా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య అవసరాల కోసం యూకేలో ఉంటున్న పలువురు గత వారం పదిరోజులుగా స్వదేశాలకు విచ్చేశారు. అందులో జిల్లాకు చెందిన 97మంది రాగా, 87మందిని అధికారులు గుర్తించారు. మరో పదిమంది అడ్రస్ తెలియకపోవడంతో అధికారులు విచారిస్తున్నారు. అయితే గుర్తించిన వారందరికీ కరోనా నిర్ధారణ (ర్యాపిడ్) పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా విదేశాల నుంచి జిల్లాకు విచ్చేసిన ఎన్‌ఆర్‌ఐలు బయటకు రాకూడదని, హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. దీంతో కొందరు హోమ్ క్వారంటైన్‌కు అంగీకారం తెలపగా, మరికొందరు మాత్రం తాము తిరిగి విదేశాలకు వెళ్ళేందుకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉందని, హోమ్ క్వారంటైన్‌కే పరిమితమైతే ఎలా? అంటూ నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచారు. మరో 84మందిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. వారిలో73మందికి కరోనా లక్షణాలు గుర్తించేందుకు రెండుసార్లుఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటివరకు 13మందికి నెగెటివ్ రాగా, మరో 60మంది ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే ప్రైమరీ కాంటాక్ట్ కింద 183ని గుర్తించారు. వారిలో 138మంది శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అయితే ఫలితాలు వచ్చేవరకు విదేశాల నుంచి విచ్చేసిన వారు ఇళ్ళలో నుంచి బయటకు రాకూడదని, ఎవరిని కలవకూడదని స్పష్టం చేయడంతో వారందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.