భార్యాభర్తల ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-14T02:00:29+05:30 IST
మండల పరిధిలోని యనమదలలో భార్యాభర్తల బలవన్మరణ కేసులో నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు ఎస్సై వై.వి.చౌదరి చెప్పారు.
యద్దనపూడి, నవంబర్ 13 : మండల పరిధిలోని యనమదలలో భార్యాభర్తల బలవన్మరణ కేసులో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై వై.వి.చౌదరి చెప్పారు. యనమదలకు చెందిన ఓ యువతి నరసరావుపేటలో ఇంజినీరింగ్ చదువుతోంది. అక్కడ గురజాలకు చెందిన మణికంఠ అనే యువకుడు ఆ యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించింది. వెంటనే ఆ యువకుడు యనమదలకు వచ్చి యువతి తల్లిదండ్రుల వద్ద వివాహ ప్రస్తావన తెచ్చాడు. వారూ తిరస్కరించారు. ఆ యువకుడు మరోమారు అలా ప్రయత్నించినా ఆ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కుమార్తె వివాహంపై గ్రామంలో చర్చించుకుంటుండగా తమ పరువు పోయిందన్న ఆవేదనతో యువతి తల్లిదండ్రులు ముప్పరాజు హనుమంతరావు, నాగరాజలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితున్ని శుక్రవారం యనమదల ఆంజనేయస్వామి గుడి వద్ద అరెస్ట్ చేసి పర్చూరు కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై చెప్పారు.