పోలీసుల అవినీతిపై కరపత్రాల కలకలం
ABN , First Publish Date - 2020-12-18T05:18:09+05:30 IST
పోలీస్ అధికారుల అవినీతి బాగోతం బయటపెడుతూ ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు (పాంప్లెట్స్) మార్టూరు, బల్లికురవలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇంకొల్లు సర్కిల్ పరిధిలో ఉన్న మార్టూరు, అద్దంకి సర్కిల్ పరిధిలో ఉన్న బల్లికురవ పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఆయా సర్కిల్ అధికారులకు ఎంతెంత ముడుతున్నాయో అందులో వేశారు.

గ్రానైట్ అక్రమ రవాణాపై అంతర్యుద్ధం
బల్లికురవ, మార్టూరులో వెలసిన పాంప్లెట్లు
చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా ఆగని అక్రమ రవాణా
మరింత పెరిగిన రవాణా చార్జీలు
వసూళ్లలో ముందున్న మార్టూరు పోలీసులు
అద్దంకి, డిసెంబరు 17: పోలీస్ అధికారుల అవినీతి బాగోతం బయటపెడుతూ ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు (పాంప్లెట్స్) మార్టూరు, బల్లికురవలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇంకొల్లు సర్కిల్ పరిధిలో ఉన్న మార్టూరు, అద్దంకి సర్కిల్ పరిధిలో ఉన్న బల్లికురవ పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఆయా సర్కిల్ అధికారులకు ఎంతెంత ముడుతున్నాయో అందులో వేశారు. మామూళ్లు తీసుకోవటంలో బల్లికురవ ప్రాంత పోలీస్ అధికారుల కంటే మార్టూరు పోలీస్ అధికారులే ముందున్నారట. ఈ వ్యవహారం పోలీసుశాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గ్రానైట్ అక్రమ రవాణా అడ్డుకట్టకు సరిహద్దులలో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా అక్రమ రవాణా ఆగలేదు. గతంలో ఎక్కువ ముఠాలు అక్రమ రవాణా నిర్వహించగా ప్రస్తుతం పోలీస్ అధికారులతో సంబంధమున్న కొందరు మాత్రమే చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండానే రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ అక్రమ రవాణా ముఠాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ నేపథ్యంలోనే పాంప్లెట్లు పంచాయితీ వచ్చిందని తెలుస్తోంది. ఒక్కో గ్రానైట్ శ్లాబుల లారీకి మార్టూరు పోలీసులు రూ.10వేలు తీసుకుంటుంటే, బల్లికురవ పోలీసులు రూ.6వేలతో సంతృప్తిచెందుతున్నారట.. ఇక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద ఒక్కో లారీకి రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ గుంజుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టు వద్ద మాత్రం రూ.12వేలు ఫిక్స్ చేశారు. గతంలో ఒక గ్రానైట్ శ్లాబు లారీ సరిహద్దు దాటాలంటే రూ.25వేలు ఉండగా, ప్రస్తుతం రూ.35వేలు చెల్లించుకోవాల్సిందే.
300 పాంప్లెట్లు స్వాధీనం
గ్రానైట్ అక్రమ రవాణాలో సిద్ధహస్తులైన పలువురు తమను దూరంగా పెట్టారన్న ఉద్దేశంతో పోలీస్ అధికారుల అవినీతిని ఓ జర్నలిస్టు ప్రశ్నిస్తున్న విధంగా కరపత్రాలు ముద్రించి బుధవారం అర్ధరాత్రి సమయంలో మార్టూరు, తాతపూడి ఫ్లైఓవర్ వద్ద, బల్లికురవలోని పలు దుకాణాల వద్ద ఉంచారు. విషయం తెలిసిన మార్టూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అర్ధరాత్రి సమయంలోనే దొంగబిల్లులతో అక్రమ రవాణా చేసే పలువురిని తనిఖీ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో కొన్ని చోట్ల పడి ఉన్న 300 పాంప్లెట్లను స్వాధీనపర్చుకొని స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అందులో స్థానిక పోలీసుల అవినీతి విషయం జిల్లా అధికారుల దృష్టికి పోవాలన్న ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయమై పోలీస్ అధికారుల దృష్టికి తీసుకుపోగా వారు స్పందించేందుకు సుముఖత చూపలేదు. పాంప్లెట్‌లు వేసిన వ్యక్తుల గురించి ఆరాతీసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది.