దీపాలు వెలిగిద్దాం.. సమైక్యత చాటుదాం

ABN , First Publish Date - 2020-04-05T10:04:31+05:30 IST

కరోనా వైర్‌సపై సమైక్య పోరాటం చేస్తున్న సందేశాన్ని, సంకేతాన్ని పునరుద్ఘాటించేందుకు జిల్లా ప్రజానీకం సన్నద్ధం అవుతున్నది.

దీపాలు వెలిగిద్దాం.. సమైక్యత చాటుదాం

ప్రధాని పిలుపునకు సన్నద్ధం అవుతున్న ప్రజలు

13వరోజూ కొనసాగిన లాక్‌డౌన్‌

స్వీయ నియంత్రణ పాటిస్తున్న జనం

పట్టణాల్లో గట్టిగానే పోలీసులు చర్యలు 


ఒంగోలు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైర్‌సపై సమైక్య పోరాటం చేస్తున్న సందేశాన్ని, సంకేతాన్ని పునరుద్ఘాటించేందుకు జిల్లా ప్రజానీకం సన్నద్ధం అవుతున్నది. సామూహికంగా అదివారం రాత్రి రైట్లు ఆపి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించటం ద్వారా కరోనాపై సంఘటితం, సామూహిక పోరాటాన్ని మరోసారి వ్యక్తం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో క్రమంగా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతూ రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత గట్టిగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌ 13వ రోజైన శనివారం కూడా కొనసాగగా పట్టణ, పల్లె తేడా లేకుండా ప్రజలు స్వీయ నియంత్రణ తో పాటించారు.


పలుచోట్ల అధికారపార్టీ నేతలు భౌతిక దూరానికి తిలోదకాలు ఇస్తూ సాయం పంపిణీ పేరుతో ఉల్లంఘించినా సాధారణ ప్రజానీకం మాత్రం బయటకు రాలేదు. అలాగే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో పోలీసులు కూడా పట్టణాలు, ప్రధాన రహదారులలో జనసంచారం, వాహనాలు రాకపోకలు నివారణకు గట్టిచర్యలు తీసుకొన్నారు. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి 9 నిమిషాలు పాటు క్యాండిల్‌, దీపాలు వెలిగించి కరోనాను పారద్రోలాలన్న పిలుపునకు వివిధ ప్రాంతాల ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. తదనుగుణంగా చర్యలపై అధికారులు కూడా దృష్టిసారించినట్లు తెలుస్తున్నది. 

Updated Date - 2020-04-05T10:04:31+05:30 IST