ఆందోళనకరం...
ABN , First Publish Date - 2020-07-10T10:52:09+05:30 IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ఒంగోలు నగర ప్రజలను మరింతగా కలవరపెడుతోంది.

ఒంగోలులో ఇప్పటి వరకు 247 పాజిటివ్ కేసులు
కరోనా మృతులతో మరింత కలవరం
రాబోయే రోజులపై అందరిలోనూ ఆందోళన
ఒంగోలు (కార్పొరేషన్) జూలై 9 : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ఒంగోలు నగర ప్రజలను మరింతగా కలవరపెడుతోంది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతోపాటు మృతులూ ఉండడంతో అందర్నీ కరోనా భయం వెంటాడుతోంది. వైరస్ నియంత్రణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నా, జనం కట్టడి తప్పడంతో సమస్యకు చెక్ పడే పరిస్థితులు కనిపించడం లేదు.
భవిష్యత్‌పై భయం.. భయం..!
పాజిటివ్ కేసుల పెరుగుతుండడంపై అధికార యం త్రాంగమూ ఆందోళన చెందుతోంది. ఒకవైపు పోలీసులు తనిఖీలు నిర్వహించి, పెనాల్టీలు విధిస్తుండగా, జనం మాత్రం అవే మీ పట్టనట్లు ఇష్టారాజ్యంగా రోడ్లపై సంచరించడం కేసుల పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. దుకాణాల మూసివేత మినహా జనాల రద్దీ మాత్రం ఏమా త్రం తగ్గకపోగా, రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇలానే కొనసాగితే భవిష్యత్ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు సైతం వైరస్ నివారణకు సహకరించాలని, వ్యక్తిగత జాగ్రత్త పాటించాలని, నివారణ చర్యలు పాటించాలని కోరుతున్నారు.
వైరస్ నిర్ధారణ కిట్లు లేవు
ఐసోలేషన్‌లో సైతం వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు అయిపోగా, మరోవైపు బెడ్ల సమస్య ఏర్పడటంతో వైద్యులు సైతం తలపట్టుకుంటున్నారు. వైద్య సేవలకు సైతం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయని సమాచారం. గడిచిన రెండు, మూడు రోజులుగా పరిస్థితి పరిశీలిస్తే రోగుల సంఖ్య వందకు దాటగా, మరోవైపు డిశ్చార్జ్ అవుతున్న వారు అదే స్థాయిలో ఉన్నారు. గడిచిన మూడు నెలలుగా నగరంలో 247 పాజిటివ్ బాధితులు పెరగ్గా, అందులో పది మంది వరకు కరోనా కారణంగా మృతి చెందా రు. వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలు తోడు కావడంతో కరోనా బారిన పడినవారిలో 60 ఏళ్ల వయస్సు వారు మృతి చెందారు. ఇప్పటికే నగరాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించగా, 17 కాలనీలలో రెడ్‌జోన్ విధించారు. కరోనా కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలు చేశారు. అయినప్పటికీ పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో నగరం డేంజర్ జోన్లోకి వెళ్లగా, పెరుగుతున్న కేసులపై ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఇటు కేసులు.. అటు డిశ్చార్జి
గురువారం 128 పాజిటివ్ కేసులు..
కోలుకుని ఇంటికెళ్లిన 70 మంది
పామూరులో అత్యధికంగా 35 కేసులు
అలవలపాడులో 16, ఒంగోలులో 13 కేసులు
ఒంగోలు నగరం, జూలై 9 : కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. కేసులు సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలో గురువారం కూడా భారీగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 128 పాజిటివ్ కేసులు వచ్చాయి. పామూరులో అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. ఒక్క పామూరులోనే 35 పాజిటివ్ కేసులు రాగా, అలవలపాడులో కూడా 16 కేసులు ఒకేసారి నమోదయ్యాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదు దాకా పాజిటివ్ కేసులు పరీక్షల్లో నిర్ధారణ అయ్యాయి. ఒంగోలులోని కబాడిపాలెం, గానుగపాలెంలో కేసులు నమోదు కాగా మొత్తం 13 పాజిటివ్ కేసులు ఒంగోలు ఖాతాలో చేరిపోయాయి. ఉలవపాడులో మూడు కేసులు నమోదయ్యాయి. మార్కాపురంలో తొమ్మిది కేసులు రాగా, చీరాల ప్రాం తంలో తక్కువగానే నమోదయ్యాయి. చాకిచర్ల, మన్నేటికోట, జాగర్లమూడివారిపాలెం, ఇనమనమెళ్లూరు, ఉప్పుటూరు, సంతమాగులూరు, ఇనిమెర్ల, జాండ్రపేట మండలం అక్రాయపాలెం, పొదిలి, కందుకూరు, అన్నారం, తోటవారిపాలెం, సిద్దినాయుడుపల్లె, తమ్మవరం, పెదారవీడు, రెడ్డిచెర్ల, చీమకుర్తి ప్రాంతాల్లో కేసులు వెలుగుచూశాయి. ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరికి ఇక్కడ పాజిటివ్‌గా తేలింది. బాపట్ల, వినుకొండ ప్రాంతాలకు చెందిన వారికి కరోనా నిర్ధారణ అయ్యింది.
రిమ్స్‌లోని ఐసోలేషన్‌లో కరోనాతో చికిత్సపొందుతున్న వారిలో 70మందిని గురువారం అధికారులు డిశ్చార్జి చేశారు. వీరికి మళ్ళీ పరీక్షలు చేయగా నెగటివ్ఫలితాలు రావటంతో వీరిని ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జి చేశారు. ఇంకా రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు 426 మంది ఉన్నారు.
ఖననం.. చేయనివ్వంఖననం.. చేయనివ్వం
గుండ్లకమ్మ రిజర్వాయర్ చెంతకు
కరోనా మృతదేహాలను రానివ్వబోమంటూ ఆందోళన
గ్రోత్‌సెంటర్ వద్ద తిమ్మన్నపాలెం, యర్రబాలెం వాసుల నిరసన
మేదరమెట్ల, జూలై 9 : తమ గ్రామాల పరిధిలో కరోనా మృతదేహాలను ఖననం చేయవద్దంటూ తిమ్మన్నపాలెం, యర్రబాలెం గ్రామస్థులతోపాటు గ్రోత్‌సెంటర్‌కు చెందిన వారు ఆందోళనకు దిగారు. అన్నంగి, బూరేపల్లి గ్రామాల కొండ మధ్య గుండ్లకమ్మ రిజర్వాయర్ సమీపంలో ఖననం చేసేందుకు అంబులెన్స్‌లో కరోనా మృతదేహాలను తెస్తున్నారన్న సమాచారం తెలుసుకుని వారు గురువారం రాత్రి హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలుతోపాటు దాదాపు 140 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే గుండ్లకమ్మ రిజర్వాయర్ సమీపంలో కరోనా మృతదేహాలను ఖననం చేయడమేమిటని నిలదీశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబ్జీ, పోలీసులు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను ఖననం చేయబోమని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.