నర్సు దంపతులకు కరోనా

ABN , First Publish Date - 2020-06-04T10:09:08+05:30 IST

జిల్లాలో కరోనా దూకుడు పెంచింది. ఒకేరోజు ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

నర్సు దంపతులకు కరోనా

జీజీహెచ్‌లో అప్రమత్తం

జిల్లాలో ఒకేరోజు 8 పాజిటివ్‌ కేసులు

ఆసుపత్రి సిబ్బందికి కరోనా పరీక్షలు

జిల్లాలో 108కి చేరిన కరోనా కేసులు

మరో ఇద్దరికి ట్రూనాట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ


ఒంగోలు నగరం, జూన్‌ 3: జిల్లాలో కరోనా దూకుడు పెంచింది. ఒకేరోజు ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లోని స్టాఫ్‌నర్సుకు కరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ అయ్యింది. ఆమె భర్తకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. నర్సు దంపతులకు కరోనా తేలటంతో వీరికి ఎలా వైరస్‌ సోకింది. వీరి ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకే అవకాశం ఉందనే దిశగా జీజీహెచ్‌ వైద్యులు గుర్తిస్తున్నారు. స్టాఫ్‌నర్సు భర్త ఇటీవల    తన సోదరుడికి కరోనా నిర్ధారణ కావటంతో గుంటూరు పోయి అతనిని పరామర్శించి వచ్చాడు. తర్వాత జ్వరం రావటంతో బుధవారం జీజీహెచ్‌కి తీసుకుపోయి పరీక్షలు చేయించారు.


అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్టాఫ్‌నర్సుకు కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. స్టాఫ్‌నర్సు జీజీహెచ్‌లోని కరోనా రోగులు ఉండే ఐసోలేషన్‌ వార్డులో సేవలు అందించలేదు. అయినా కరోనా వచ్చిందంటే భర్త నుంచే ఆమెకు వైరస్‌ సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది. స్టాఫ్‌నర్సు జీజీహెచ్‌లోని నర్శింగ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు. ఆమె నుంచి కరోనా వ్యాపించే అవకాశం ఉన్న అందరికీ అధికారులు కరోనా  పరీక్షలు చేయిస్తున్నారు. వీరికి ఒకేసారి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారమే కొంతమందికి ఈ పరీక్షలు పూర్తికాగా మిగిలిన వారికి గురువారం పరీక్షలు నిర్వహించనున్నారు.


భాగస్వాములకు, సన్నిహితులకు..

కాగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా వారికి జీవిత భాగస్వాములకు, వారితో సన్నిహితంగా ఉంటున్న వారికి కూడా కరోనా వైరస్‌ సోకింది. ఇలా బుధవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఉన్నాయి. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు మహిళ చెన్న్తె నుంచి జిల్లాకు రాగా ఆమెకు వారం క్రితం పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. బుధవారంఆమె భర్తకు కూడా పాజిటివ్‌ అని తేలింది. ఇదే గ్రామంలో మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇతను ఎక్కడకు పోకుండానే వైరస్‌ సోకింది. ఇటీవల పాజిటివ్‌ కేసులు నమోదైన హెచ్‌ఎంపాడు మండలం నల్లగండ్లలో మరో ఇద్దరికి పాజిటివ్‌ తేలింది.  నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన ఓ వ్యక్తి ఇద్దరు కొడుకులకు ఇప్పుడు పాజిటివ్‌ వచ్చింది. వీరు ఇటీవల చెన్నై నుంచి గ్రామానికొచ్చారు. వీరికి పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయ్యింది.


ఒంగోలుకు చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇతను కూడా ఇతర ప్రాంతాల్లో ప్రయాణించిన దాఖలాలు లేవు. ఏ ఊరు పోకుండానే కరోనా వైరస్‌ ఇతనికి కూడా వ్యాపించింది. వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో ఈ ఐదుగురికి పాజిటివ్‌గా తేలగా జిల్లాలోని మరొకరికి  ట్రూనాట్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. సంతనూతలపాడు మండలం చంద్రపాలెంకు చెందిన ఒకరికి ట్రూనాట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతను హైదరాబాద్‌  నుంచి ఇక్కడకు వచ్చారు.  బుధవారం పాజిటివ్‌గా నమోదైన ఎనిమిది మంది  పాజిటివ్‌ రోగులకు రిమ్స్‌లోని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 


108 కి చేరిన పాజిటివ్‌ కేసులు

జిల్లాలో పాజిటివ్‌ కేసులు బుధవారం నాటికి 108కి చేరాయి. మంగళవారం జిల్లాలో ఒకేసారి ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటితో 100కి చేరిన పాజిటివ్‌ కేసులు బుధవారం స్టాఫ్‌ నర్సు దంపతులతో పాటు మరో ఆరుగురికి నిర్ధారణ కావటంతో 108కి చేరాయి. కాగా వీరిలో కేవలం 42మంది మాత్రమే ప్రస్తుతం జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్సపొందుతున్నారు. మిగిలిన వారిని అందరికీ జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేసేశారు. 


క్వారంటైన్‌లకు పెరుగుతున్న అనుమానితులు

జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వారిని అందరినీ వారి వారి స్వగ్రామాలకు వెళ్లకుండా అధికారులు నేరుగా క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. రెండురోజులు క్రితం జిల్లాలోకి మరో శ్రామిక్‌ రైలు ప్రవేశించింది. దీన్లో 350మంది ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అడుగుపెట్టారు. వీరితో పాటు మరో 70మంది రాజస్థాన్‌ నుంచి జిల్లాలోకి అడుగుపెట్టారు. వీరితో పాటు తమిళనాడు నుంచి జార్ఖండ్‌కు నడిచి వెళుతున్న 20మందిని గుర్తించిన ఒంగోలు రైల్వే పోలీసులు వారిని అడ్డుకుని ఒంగోలులోని క్వారంటైన్‌కు తరలించారు.


దీంతో రోజురోజుకీ క్వారంటైన్‌లో అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ, రైజ్‌ కళాశాలలు క్వారంటైన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. రోజురోజుకీ అనుమానితులు పెరుగుతుండటంతో మరో క్వారంటైన్‌ కేంద్రాన్ని కూడా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా వలసలు పోయిన వారు జిల్లాకు తిరుగుముఖం పడుతూ లెక్కకు మించి వస్తుండటంతో పాజిటివ్‌ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


ట్రూనాట్‌లో నిర్దారణ జరిగినా పాజిటివ్‌గానే లెక్క

కరోనా పరీక్షల్లో ఇప్పటివరకు వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో నిర్ధారణ జరిగితేనే కరోనా పాజిటివ్‌ కేసుగా లెక్కిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధనల మేరకు ట్రూనాట్‌ పరీక్షలను మొదటి, రెండు స్టేజిల్లో చేసి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే ఆ కేసులను పాజిటివ్‌ లెక్కల్లో వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి వీఆర్‌డీఎల్‌ చేయకుండానే చికిత్స అందించాలని వైద్యఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో బుధవారం సంతనూతలపాడు మండం చండ్రపాలెం యువకుడికి ట్రూనాట్‌పై పాజిటివ్‌గా తేలటంలో అతనిని రిమ్స్‌లోని ఐసోలేసన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2020-06-04T10:09:08+05:30 IST