హైదరాబాద్‌లో యువకుడు మృతి.. అంబులెన్స్‌లో ఏపీలోని సొంతూరికి.. కరోనా టెస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2020-06-26T20:58:23+05:30 IST

కరోనా మహమ్మారి ఆ యువకుడిని అందరూ ఉన్నా సరే అనాథను చేసింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ యువకుని మృతదేహాన్ని

హైదరాబాద్‌లో యువకుడు మృతి.. అంబులెన్స్‌లో ఏపీలోని సొంతూరికి.. కరోనా టెస్ట్ చేస్తే..

పోలీసుల ముందుజాగ్రత్తతో తప్పినముప్పు 

పర్చూరు మార్చురీకి బోడవాడ యువకుని మృతదేహం

కరోనా అనుమానంతో శాంపిల్‌ సేకరణ

ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ


పర్చూరు (ప్రకాశం జిల్లా): కరోనా మహమ్మారి ఆ యువకుడిని అందరూ ఉన్నా సరే అనాథను చేసింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ యువకుని మృతదేహాన్ని అతని స్వగ్రామానికి కాకుండా పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మార్చురీకి తరలించడంతో కుటుంబసభ్యులతో పాటు, గ్రామంలోనూ విషాదం నెలకొంది. అయితే పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో ముప్పుతప్పినట్లైంది. వివరాల్లోకి వెళితే.. 


పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సంస్థలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం తరలిస్తుండగా గ్రామసచివాలయ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలో పోలీసులు మృతదేహం బోడవాడకు కాకుండా నేరుగా పర్చూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హైదరాబాద్‌లో కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష నిమిత్తం శాంపిల్‌ తీసుకునేందుకే ఇలా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 


కాగా చీరాలకు పంపి ట్రూనాట్‌పై పరీక్షలు నిర్వహించాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్థుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పోలీసులు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించకపోవటంతో పెనుప్రమాదం తప్పిందని వారు అంటున్నారు.

Updated Date - 2020-06-26T20:58:23+05:30 IST