-
-
Home » Andhra Pradesh » Prakasam » Corona effect for government offices
-
ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-03-24T11:08:32+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా వైరస్ ఎఫెక్టు తగిలింది. సాధారణంగా సోమవారం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు

రెండు, మూడు శాఖలు మినహా మిగిలినవి ఖాళీ
ప్రభుత్వ కార్యాలయాలకు రాని ప్రజానీకం
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 23 : ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా వైరస్ ఎఫెక్టు తగిలింది. సాధారణంగా సోమవారం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజానీకం వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి తరలివస్తారు. గత వారంరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే జనతా కర్ప్యూ విజయవంతం కావడంతో పాటు ఈనెల 31 వరకు లాక్ డౌన్‌ను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించాయి. ఈనేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కరోనా నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. సాధారణంగా ప్రతి సోమవారం స్పందనకు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి వస్తుంటారు.
ఏదైనా కారణాల చేత స్పందన వాయిదాపడిన ప్రజానీకం వచ్చి ఏదో ఒకస్థాయి అధికారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేవారు. కానీ ఈ సోమవారం కలెక్టరేట్‌లో కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ప్రజానీకం కనిపించిన పరిస్థితి లేదు. ఇంకొకవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగుల సందడి లేదు. ప్రధానమైన రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ట్రెజరీ శాఖల్లో మాత్రమే పూర్తిస్థాయిలో సిబ్బంది పనిచేయడం కనిపించింది. మిగిలిన అన్ని శాఖల్లో సిబ్బంది సగానికి సగం తగ్గిపోయారు. ప్రభుత్వం కూడా సిప్టుల వారీగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.
బోసిపోయిన కలెక్టరేట్
సోమవారం వచ్చిందంటే కలెక్టరేట్ వద్ద కనీసం రెండు, మూడు ధర్నాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు 200 నుంచి 300మంది వరకు ప్రజలు వస్తుంటారు. అయితే ఈ సోమవారం మాత్రం కలెక్టరేట్ కనీసం పట్టుమని పదిమంది కూడా ప్రజానీకం కనిపించలేదు. ఇక ప్రగతిభవన్, ప్రభుత్వ ఉద్యోగుల సముదాయ భవన్ (పాతరిమ్స్)లోని కార్యాలయాల్లో కూడా కరోనా ఎఫెక్టు కనిపించింది.
మాస్కులతో విధులు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు మాస్కులు, రుమాళ్లు కట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.