ఆగని కేసులు

ABN , First Publish Date - 2020-04-07T11:00:40+05:30 IST

జిల్లాలో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి జిల్లాలో కేసుల సంఖ్య 24కి

ఆగని కేసులు

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 6: జిల్లాలో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  సోమవారం నాటికి జిల్లాలో కేసుల సంఖ్య 24కి చేరింది. కొనకనమిట్ల మండలం ఉమ్మడి వెలిగండ్లకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు గత నెలాఖర్లో స్వగ్రామమైన ఉమ్మడి వెలిగండ్ల గ్రామానికి వచ్చాడు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారంరోజుల క్రితం రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.


స్వాబ్‌ను తీసి పరీక్షల కోసం పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం జిల్లాలో ఒక కేసు నమోదు కాగా ఆదివారం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా ఇటీవల ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు ఒంగోలులో తొమ్మిది కేసులు, చీరాల్లో ఐదు, కందుకూరులో మూడు,చీమకుర్తిలో ఒకటి, కనిగిరిలో ఒ కటి, కారంచేడు మండలం కుంకలమర్రులో నాలుగు, తాజాగా కొనకమిట్ల మండలం ఉమ్మడి వెలిగండ్లలో ఒకటి నమోదయ్యాయి. 


వందల సంఖ్యలో అనుమానితులు..

జిల్లాలో వందలసంఖ్యలో అనుమానితులను అధికారులు గుర్తిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంటు ప్రాంతాలుగా ప్రకటించి తగిన చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉన్న అందరినీ అనుమానితులుగానే భావిస్తూ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీరిని వారి ఇళ్ళ నుంచి తెచ్చి క్యారంటైన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం వందలసంఖ్యలో అనుమానితుల నుంచి అధికారులు స్వాబ్‌లను తీసి పరీక్షల కోసం పంపిస్తున్నారు.


వారంరోజుల క్రితం వరకు కేవలం రిమ్స్‌లోనే అనుమానితుల నుంచి స్వాబ్‌లను సేకరించి పరీక్షల కోసం పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఎక్కడికక్కడే స్వాబ్‌లను అనుమానితుల నుంచి సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నారు. రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు మన జిల్లా నుంచి స్వాబ్‌లను పరీక్షల కోసం పంపిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే మన జిల్లా నుంచే ఎక్కువగా స్వాబ్‌లు పరీక్షల కోసం పంపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జిల్లా నుంచి 610మంది అనుమానితుల నుంచి స్వాబ్‌లను సేకరించి పరీక్షల కోసం పంపించగా 364మంది ఫలితాలను వెలువడ్డాయి. ఇందులో పాజిటివ్‌లుగా 24మందికి నిర్ధారణ కాగా 340మందికి నెగటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇంకా 246మంది ఫలితాలు వెలువడాల్సి ఉంది. వీటిలో కూడా మరికొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.


కందుకూరు ప్రాంతం నుంచే ఎక్కువ

జిల్లాలోని ఒంగోలు, చీరాల ప్రాంతాల్లో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వారి నుంచి కరోనా వైరస్‌ జిల్లాలో ఎక్కువగా వ్యాప్తిచెందింది. వీరికి, వీరి నుంచి వ్యాప్తిచెందిన 22మందికి పాజిటివ్‌గా తేలింది. మిగిలిన రెండు కేసుల్లో తొలి కేసుగా నమోదైన యువకుడు లండన్‌ నుంచి రాగా, తాజాగా కొనకనమిట్లలో నమోదైన కేసు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ కరోనా బారిన పడ్డాడు. కాగా జిల్లాలోని కందుకూరు ప్రాంతం నుంచి స్వాబ్‌లు ఎక్కువగా పరీక్షల కోసం పంపిస్తున్నారు.


కందుకూరు ప్రాంతంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 200లకు పైగా అనుమానితుల నుంచి స్వాబ్‌లు సేకరించి పరీక్షల కోసం పంపించారు. మన జిల్లా నుంచే అధికంగా స్వాబ్‌లు పరీక్షల కోసం పోతుండగా ల్యాబ్‌ల్లో పరీక్షలు ఆలస్యమవుతూ ఫలితాలు కూడా నిదానంగానే వస్తున్నాయి. 


హాట్‌స్పాట్‌లుగా గుర్తింపు

జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను ప్రభుత్వం హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించింది. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నారు. ఒంగోలు, చీరాల, కుంకలమర్రు, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి, కొనకనమిట్ల మండలం వెలిగండ్ల ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి రోడ్లను మూసివేశారు. వైరస్‌ ఇతరులకు సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించారు. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా వారిని క్వారంటైన్‌లకు తరలించడమో లేక వారికి అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 


Read more