దారి దోపడీ
ABN , First Publish Date - 2020-06-18T10:40:34+05:30 IST
కనిగిరి నియోజకవర్గంలో అధి కారపార్టీ దారిదోపిడీ ఎక్కువైంది. పంచాయతీరాజ్‌శాఖ కింద రూ.7.5 కోట్ల ఎన్‌ఆర్‌జీఎస్ మెటీరియల్

జనం కళ్లల్లో మట్టికొట్టి... కోట్లు కొల్లగొట్టి!
గ్రామీణ రోడ్ల నిర్మాణంలో మాయ
కనిగిరి నియోజకవర్గంలో రూ.7.5కోట్లతో పనులు
కీలక ప్రజాప్రతినిధే చేపట్టిన వైనం
నాసిరకంగా చేసినా కిమ్మనని అధికారులు
మొన్న కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన దారులు
ఆయన మృధుస్వభావి.. నిజాయితీపరుడు.. అని అనుకున్నారు ప్రజలంతా..! అందుకే మునుపెన్నడూ లేనివిధంగా భారీ మెజారిటీతో పట్టం కట్టారు..! కానీ వారిలో ఆ భావన పోవడానికి మూన్నాళ్లు కూడా పట్టలేదు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ భారీగా అవినీతికి తెరతీశారు. అధికారం చేపట్టిన ఏడాదిలో నీరు, భూమి పంపిణీలో స్వాహా పర్వాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. అందినకాడికి దోచుకున్నారు. ఇది చాలదన్నట్లు అన్నీతానై నియోజకవర్గంలో అవినీతికి ‘దారులు’ వేశారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ మెటీరియల్ నిధులు రూ.7.5కోట్లతో చేపట్టిన గ్రావెల్ రోడ్ల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. రోడ్డుపక్క మట్టినే తవ్వి పోసి తూతూమంత్రంగా పైన గ్రావెల్ వేసి బిల్లులు పొందారు. తాజాగా కురిసిన వర్షాలతో ఆ రోడ్లు కోసుకుపోయి, కొట్టుకుపోయి గుంతలమయమయ్యాయి. పనుల్లో అవినీతి, డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
కనిగిరి టౌన్, జూన్ 17 : కనిగిరి నియోజకవర్గంలో అధి కారపార్టీ దారిదోపిడీ ఎక్కువైంది. పంచాయతీరాజ్‌శాఖ కింద రూ.7.5 కోట్ల ఎన్‌ఆర్‌జీఎస్ మెటీరియల్ నిఽధులతో 64 గ్రావె ల్ రోడ్ల పనులు వివిధ గ్రామాలకు 166.27కి.మీ. మేర చేప ట్టారు. ఆ రోడ్లన్నీ మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికి గుంత లమయంగా మారాయి. కోసుకుపోయి పక్కలకు కొట్టుకుపో యాయి. నియోజకవర్గంలోని పీసీపల్లి, వెలిగండ్ల మండలాల్లో వేసిన రోడ్లయితే చెప్పే పరిస్థితి లేదు. పీసీపల్లె మండలంలో బట్టుపల్లి నుంచి పాతముద్దపాడు వరకు రూ.10లక్షలతో వేసిన మట్టిరోడ్డు, గోపవరపువారిపల్లి నుంచి రామగోపాలపు రం వరకు రూ.5లక్షలతో వేసిన మట్టిరోడ్డు మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయింది. వెలిగండ్ల మండలంలో ని రూ.32లక్షలతో వేసిన తాడేవారిపల్లి నుంచి కొటాలపల్లి వరకు రోడ్డు, రూ.10లక్షలతో వేసిన వెంగళరెడ్డిపల్లి నుంచి కొటాలపల్లి మట్టిరోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. పామూరు మండలంలో రూ.16లక్షలతో మోపా డు నుంచి కొండారెడ్డిపల్లి వరకు వేసిన మట్టిరోడ్డు స్వరూ పమే లేదు. సీఎస్‌పురం మండలంలో రూ.16లక్షలతో వేసిన కోయిలంపాడు నుంచి పెదరాజుపాలెం వరకు వేసిన రోడ్డు కూడా మట్టి అంతా కొట్టుకుపోయి గులకరాళ్లు బయటపడ్డా యి. దీంతో ఆ రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆ రోడ్డులో వెళ్తూ వాహనం అదుపుతప్పి కొంతమంది గాయాలపాలయ్యారు.
నిబంధనలకు పాతర.. పట్టించుకోని అధికారులు
స్వయంగా నియోజవర్గస్థాయి ప్రజాప్రతినిధే రోడ్ల పనులు చేపట్టడంతో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో నాణ్యత మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎవరు చూస్తారులే అన్నట్లుగా పనులు ఆగమేఘాలపై చేసే శారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల పేరు మీద మొత్తం వ్యవహారం నడుస్తోంది. బిల్లులు కూడా వారికే వస్తాయి. అయితే కీలక ప్రజాప్రతినిధి అంతా తానై రంగంలోకి దిగడంతో అడగడం అటుంచి అటువైపు చూసే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. అసలు కొన్నిచోట్ల అయితే ఎక్స్‌కవేటర్‌తో రోడ్డు సైడు కాలువల మాదిరిగా తవ్వి అదే మట్టిని రోడ్డుకు పోశారన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై గ్రావెల్ తెచ్చి పైపైన చల్లించి బిల్లులకు సిద్ధం చేశారు. అయితే అధికారులు కూడా తమకెందుకులే అన్నట్లు వ్యవహరించటంతో సైడు బెడ్డింగ్‌లు సరిగా లేక చిన్నవర్షానికే రోడ్లు కొట్టుకుపోయాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టిరోడ్డు వెడల్పు 10 అడుగులు ఉండాలనే నిబం ధన పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లు వేశారు. పనులను ఈ ప్రాంతానికి చెందిన వారితో కాకుండా తన సొంత మనుషులను తీసుకొచ్చి చేయించారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా ఈ పనులను తమకు ఇవ్వకుండా సొంతగా ఆయనే చేసుకుంటున్నాడని స్థానిక నేతలు, ద్వితీయశ్రేణి నా యకులు అసంతృప్తిగా ఉండటం గమనార్హం. పైగా ఆయన పీఏగా చెప్పుకునే వ్యక్తి రోడ్ల పనులపై నాయకులను మరింత రెచ్చగొడుతున్నారనే ప్రచారం ఎక్కువైంది. కాగా ఈ వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ఆయా పంచాయతీ కార్యదర్శులు వణికిపోతున్నారు.
రూ.కోట్ల స్వాహాకు రోడ్లు కలిసొచ్చాయ్!
నియోజకవర్గంలో కనిగిరి మండలంలోని చాకిరాల, గురువాజీపేట, జమ్మలమడక, చినిర్లపాడు, బొమ్మిరెడ్డిప ల్లి, యడవల్లి, తుమ్మకుంట, పోలవరం, ఏరువారిపల్లి గ్రా మాల్లో రూ.కోటి 10లక్షలతో 31.90 కి.మీ. మేర రోడ్లు 40శాతం పనులు నిర్వహించారు. పామూరు మండలం లో తొమ్మిది గ్రామాలకు రూ.కోటి 87లక్షలతో 28.60కి.మీ, పీసీపల్లి మండలంలో 10రోడ్లు రూ.74లక్షలతో 19.04కి.మీ, వెలిగండ్ల మండలంలో 8 రోడ్లు రూ.కోటి 10లక్షలతో 24.40కి.మీ, సీఎస్‌పురం లో 7రోడ్లు రూ.కోటి 35లక్షలతో 20.30 కి.మీ, హనుమంతునిపాడు మండలంలో 14 రోడ్లు రూ.కోటి 42లక్షలతో 42.03 కిలో మీటర్లు అంచనాలు ఖరారు చేసి పనులు మొదలెట్టారు.
ప్రమాణాలు పాటించకుంటే మళ్లీ చేయిస్తాం
ఇప్పటివరకు వెలిగండ్ల, సీఎస్‌పురం మండలాల్లో చేపట్టిన మట్టిరోడ్డు ప నులు పూర్తవగా వెలిగండ్ల మండలానికి ఇప్పటికే రూ. 25లక్షలు నగదు చె ల్లించాం. మిగతా మండలాల్లో జరిగిన 40శాతం పనులకు బిల్లులు సిద్ధం చేశాం. జియోట్యాగింగ్ చేశాక, ప్రమాణాల మేరకు పనులు జరిగిన రోడ్లకే బిల్లు చెల్లిస్తాం. లేకుంటే మళ్లీ పనులు చేయిస్తాం.
కె.ఆదిశేషు, పంచాయతీరాజ్ డీఈ