-
-
Home » Andhra Pradesh » Prakasam » Commodity prices
-
బతికేదెట్లా!
ABN , First Publish Date - 2020-05-13T10:47:22+05:30 IST
నెలక్రితం వరకు అదుపులోనే ఉన్న నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అన్నింటి

సరుకులు సుర్రుమంటున్నాయ్..
నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు
ధరల నియంత్రణ గాలికొదిలేశారు
బియ్యం క్వింటాల్‌కు రూ.800 పెరుగుదల
ప్రశ్నిస్తే సరుకు రావడం లేదనే సమాధానం
కరోనాను ఎదుర్కోవాలంటే పోషకాహారమే తరుణోపాయం
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు
నిత్యావసర సరుకుల ధరల మోత మోగుతోంది. సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించడం లేదు. అసలే కరోనా కాలంలో లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితి కకావికలం కాగా ధరల పెరుగుదల గోరుచుట్టు మీద రోకలిపోటులా తయారైంది. ఏ వస్తువులు చూసినా భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు కొంతమేర అదుపులోనే ఉన్న ధరలు తర్వాత వ్యాపారుల మాయాజాలంతో చుక్కలనంటాయి. సరుకుల రవాణాకు ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసినా సరే డిమాండ్ మార్కెట్ నడుస్తోంది.
ప్రధానంగా పప్పులు పేలుతున్నాయి. నూనెలు నింగినంటాయి. బియ్యం ధరలు భయపెడుతున్నాయి. అసలే చేతిలో చిల్లిగవ్వలేని ప్రస్తుత కాలంలో ధరలు వేసవి ఎండలను మించి మండుతున్నాయని పేదలు వాపోతున్నారు. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు నిర్ణయించినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ధరలను అదుపులోకి తేవాల్సిన యంత్రాంగం ఆ వైపు దృష్టిపెట్టినట్లు లేదు.
ఒంగోలు(జడ్పీ), మే 12: నెలక్రితం వరకు అదుపులోనే ఉన్న నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అన్నింటి మీద కేజీకి రూ.20 వరకు ధరలు పెరిగాయి. వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి లాక్‌డౌన్ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హోల్‌సేల్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తాత్కాలిక డిమాండ్‌ను సృష్టించి తర్వాత మార్కెట్లోకి సరుకులను సరఫరా చేస్తున్నారు. అసలే ఆదాయాలు లేక బతుకే భారమవుతున్న కష్టజీవులకు ఈ పెరిగిన ధరలతో నెలకు రూ.500 నుంచి రూ.1000 వరకు అదనపు భారం పడుతోంది. ‘మా ఇంట్లో మొత్తం ఆరుగురం ఉంటాము. గతంలో సరుకులకు నెలకు రూ.4వేల దాకా ఖర్చు అయ్యేవి. ఇప్పుడు అదనంగా రూ.1000 భారం పడుతోంది. ఆ అదనపు భారపు మొత్తంతో అనారోగ్యంతో ఉన్న మా అమ్మకు మందులు వచ్చేవి. విధిలేని పరిస్థితుల్లో సరుకులు తగ్గించుకుని మందులే తీసుకుంటున్నాను’ పెరిగిన ధరల నేపథ్యంలో ఒక సామాన్యుడి వేదన ఇది.
రవాణా సదుపాయం లేదనే సాకు
లాక్‌డౌన్ విధించిన తొలిరోజు నుంచే నిత్యావసరాల సరఫరా చైన్ తెగిపోకూడదనే ఉద్దేశంతో సర్కారు సరుకుల రవాణాకు అనుమతి ఇచ్చింది. అలాగే ధరలను కూడా ప్రకటించింది. అయితే ధరలపై పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం అయిపోయింది. మొదట్లో అదుపులోనే ఉన్న వ్యాపారస్తులు తర్వాత రవాణా సాకుగా చూపి రేట్లు పెంచడం కేవలం లాభాల కోసమే అనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న నిత్యావసరాలన్నీ ఎక్కువశాతం పాతవే. ఇంకా కొత్త పంట మార్కెట్‌లోకి రాలేదు. అయినప్పటికీ ధరలు పెరగడం వ్యాపారుల సిండికేట్ ఫలితమే అని వినియోగదారులు విమర్శిస్తున్నారు.
పోషకాహారం తీసుకోవాలని ప్రభుత్వాలే ప్రచారం
కరోనాను ఎదుర్కోవాలంటే సరైన ఆహారం కూడా తీసుకోవాలని పాలకులే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పూటల ఆహారం దొరకడమే సామాన్యుడికి గగనమైన పరిస్థితుల్లో బలవర్ధకమయిన ఆహారమెక్కడిది అని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంటేనే కదా తాము పోషకాహారం తీసుకోగలిగేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బియ్యం ధర పెరిగింది
నెల రోజులక్రితం క్వింటా బియ్యం ధర రూ.4000 ఉండగా ప్రస్తుతం రూ.4,800గా ఉంది. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ ధర పెరగడానికి కారణం వ్యాపారులే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర పెరగడానికి వ్యాపారులు చెప్పే ఇంకో కారణం మిల్లులు మూసి ఉన్నాయని, కార్మికులు అందుబాటులో లేరని చెబుతున్నారు. జిల్లాలో ఉన్న బియ్యం నిల్వలు రెండునెలలకు సరిపోతాయని నిత్యావసరాల సమీక్షలో జిల్లా యంత్రాంగమే తెలిపింది. అయినా ధరలు పెరగడంలో మతలబు ఏమిటో తెలియడం లేదు.
క్షేత్రస్థాయి తనిఖీలు శూన్యం
ధరలు అదుపులో ఉంచడానికి అధికార యంత్రాంగం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్ధాయిలో తనిఖీలు కొరవడడం, కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. రేట్లను సూచించే పట్టికను ప్రతి దుకాణం ముందు ప్రదర్శించాలనే అధికారుల ఆదేశాలను చాలామంది పట్టించుకున్న ధాఖలాలు లేవు. సడలింపుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించే శక్తులు తయారై ధరలను శాసించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి. ఆదిలోనే ఇలాంటి దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేయకపోతే నిత్యావసర సరుకులు కూడా సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలే అవకాశముంది.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
ప్రభుత్వం నిత్యావసర సరుకుల రవాణాకు అనుమతులు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారస్తుల వాదన. రాష్ట్ర పరిధిలోని సరుకుకు పెద్ద ఇబ్బందులు లేవని, కానీ అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు అనేక రకాలైన ఆంక్షలను అధికారులు పెడుతున్నారని వారు చెబుతున్నారు. కూలీల వేతనాలు, లోకల్ రవాణా కూడా గతంలో కన్నా రెట్టింపు అయిందంటున్నారు.
సరుకులు నెలముందు ధర (కిలో) ప్రసుతధర(కిలో)
వేరుశనగనూనె 120 140
మినపగుళ్లు 90 110
పెసరపప్పు 100 120
వేరుశనగగుళ్లు 90 120
వెల్లుల్లి 110 130
పచ్చిశనగపప్పు 55 70
కారం 300 400
ఆవాలు 55 70