ప్రార్థనా స్థలాల వద్ద ముందస్తు చర్యలు: కలెక్టర్ పోలా భాస్కర్
ABN , First Publish Date - 2020-10-04T17:21:54+05:30 IST
జిల్లాలో మతపరమైన ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా..
ఒంగోలు: జిల్లాలో మతపరమైన ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలా భాస్కర్ అదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవన్‌లో శనివారం దేవదాయశాఖ, పోలీస్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట పరిధిలో ఉన్న దేవస్థానాలు, మసీదులు, చర్చిల నిర్వహణపై ప్రాథమిక సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న 879 సచివాలయాల పరిధిలోని ప్రార్థన స్థలాలను,177 వార్డు సచివాలయాల పరిధిలోని ప్రార్థనాల స్థలాలను జియోట్యాగ్ చేయాలన్నారు.
చట్ట పరిధిలోకి వచ్చే ప్రార్థనా స్థలాలపై విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ మహిళా పోలీసులు, వలంటీర్లు నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా చూడాలన్నారు. హిందూ దేవాలయాల చారిటబుల్ ట్రస్టు పరిధిలో 1686 దేవాయాలు ఉన్నాయని, వీటిని ఆయా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోకి వచ్చేలా సర్వే చేయాలన్నారు. ప్రార్థనా స్థలాలు, విగ్రహాలు, ఉపకరణాల్నంంటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అదేశించారు. ఎస్పీసిద్ధార్థ కౌశిల్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మతాలకు సంబంధించి 6600 ప్రార్థనా స్థలాలను గుర్తించి వాటిని జియోట్యాగ్ చేశామన్నారు. అందులో 100 ప్రార్థనా స్థలాలు ప్రాచూర్యం పొందాయని, వాటి భద్రతపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం 400 ప్రార్థనా స్థలాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకుసీసీకెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఓఎ్‌సడీచౌడేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో దేవాలయాలు, మసీదులు, చర్చీ వద్ద అల్లర్లు జరగకుండా సామాజిక మాధ్యమాలలో విమర్శలను అరికట్టే చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సమావేశంలో దేవదాయ శాఖ సహాయ కమిషనర్ మాధవి, డీపీవో జీవీ నారాయణరెడ్డి, దేవదాయశాఖ పర్యవేక్షకులు సుధాకర్, అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరావు, దేవదాయశాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.