కరోనాకు ‘చెక్‌’

ABN , First Publish Date - 2020-03-28T10:39:46+05:30 IST

మండలంలోని గుంటుపల్లిలో శుక్రవారం పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని మండలంలోకి

కరోనాకు ‘చెక్‌’

మండల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటు

పలు గ్రామాల్లో పికెట్లు

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యపరీక్షలు


పీసీపల్లి, మార్చి 27: మండలంలోని గుంటుపల్లిలో శుక్రవారం పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని  మండలంలోకి రాకుండా నిలువరించేందుకు  పికెట్‌ ఏర్పాటు చేసినట్టు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. పీసీపల్లి నుంచి ఉపాధి కోసం తెలంగాణ, బెంగుళూరు తదతర ప్రాంతాలకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్లారు. వారంతా తమ సొంత గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. నుండి రాత్రి వేళ రహస్యంగా వస్తున్నారంటూ గుంటుపల్లి, వరిమడుగు, శంకరాపురం తదితర గ్రామాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేయిస్తున్నారు. స్వీయ గృహ నిర్భందంలో ఉంటామని హామీ ఇస్తేనే మండలంలోకి అనుమతిస్తున్నారు. లేకుంటే వెనక్కి పంపిస్తున్నారు.


చెక్‌పోస్టుల వద్ద నిఘా 

మండలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గస్తీని ముమ్మరం చేస్తున్నామని సీఐ ఏఎస్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు.తిరగలదిన్నె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిఘా పక్కాగా ఉండాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళ వాహనాలు తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వారిని ఏ పనిమీద వస్తున్నారో వివరాలు తెలుసుకొని అనుమతించాలన్నారు. 


పర్చూరు : కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే విధంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినతరం చేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం సమయంలో నిత్యవసర వస్తువుల కొనుగోలు చేసుకోవడానికి కేటాయించిన సమయంలో తప్ప ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడే విధంగా పరిస్థితి నెలకొంది.


జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు కఠినతరం చేయడంతో రోగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదనడంతో రోగులు తీవ్ర ఆవేధనకు గురయ్యారు.


బల్లికురవ  :  గ్రామ సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఐ శివనాంచారయ్య తెలిపారు. కూకట్లపల్లి, వేమవరం, కొప్పెరపాలెంలో పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.  కొత్తవ్యక్తులు ఎవరైనా వస్తే వారిని క్యారంటైన్‌కు తరలిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమెదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.


బల్లికురవ : గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలను గమనించాలని తహసీల్దార్‌ పి. మధుసూదనరావు సూచించారు.   తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.


యద్దనపూడి  :  మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోను ఇతర ప్రాంతాల  నుంచి వచ్చిన వారి వివరాలను  అధికారులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా తహసీల్దార్‌  వెంకటరత్నం, ఎస్సై వెంకటేశ్వర్రావు చౌదరి, వైద్యులు సుష్మ ఒక బృందంగా ఏర్పడి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు. మహిళా పోలీసు బి.జ్యోతి, పీఈటీ ప్రతాప్‌లు కూడా వివరాలు సేకరించారు. చిలుకూరివారిపాలెంలో హైదరాబాదు నుంచి వచ్చిన సినీ దర్శకులు అనిల్‌ రావిపూడి వద్ద వివరాలు సేకరించారు.


దర్శి :  కరోనా మహమ్మారిపై గ్రామాల్లో అవగాహన పెరగడంతో ఇతర ప్రాంతాల వారు రాకుండా రహదారులకు కంపవేసి మార్గాలను మూసివేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు రాజంపల్లి-బొద్దికూరపాడు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కంప వేశారు. దర్శి పట్టణంలో కర్ప్యూ కొనసాగుతోంది. నగర పంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో హైడ్రోప్లోరైడ్‌ పిచికారి చేశారు. అధికారుల లెక్కల ప్రకారం హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నుండి సుమారు 900 మంది వచ్చినట్లు సమాచారం. 

Updated Date - 2020-03-28T10:39:46+05:30 IST