పాఠశాలకు లేని కరోనా.. ఎన్నికలకు వచ్చిందా..? : నూకసాని
ABN , First Publish Date - 2020-11-26T05:57:16+05:30 IST
ఎన్నికల నిర్వహణకు కరోనాను బూచిగా చూపుతున్న ప్రభుత్వం పాఠశాలలను ఎలా నిర్వహిస్తోందని ఒంగోలు టీడీపీ లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు నూకసాని బాలాజీ విమర్శించారు.

ఎర్రగొండపాలెం, నవంబరు 25 : ఎన్నికల నిర్వహణకు కరోనాను బూచిగా చూపుతున్న ప్రభుత్వం పాఠశాలలను ఎలా నిర్వహిస్తోందని ఒంగోలు టీడీపీ లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు నూకసాని బాలాజీ విమర్శించారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం వెనుకడుగు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేస్తే కరోనా వైరస్‌లేదని ఎస్‌ఈసీపై వైసీపీ మంత్రులు ఎదురుదాడి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వం కరోనాను సాకుగా చూపడం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు నివేశస్థలపట్టాలు పేరుతో భూమి చదును పేరు చెప్పి 4 వేలకోట్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకున్నారన్నారు. పెద్దారవీడు ఎస్సై టీడీపీ కార్యకర్తల సెల్‌పోన్లు లాక్కొని వేదింపులకు గురిచేస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేస్తే కోర్టులో వాజ్యాలు వేస్తామని, హెచ్చరించారు. పోలీసుల అక్రమకేసులను చూస్తూ ఊరు కోమని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టాక దళితులపై దాడులు, ఇళ్లు కూల్చడాలు, శిరోమండనాలు చేయించడం వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యతిరేకంగా మాట్లాడి రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షులు చంద్రశేఖరెడ్డి తన గురుభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో పేదలకు నివేశస్థలాలు ఇచ్చే సెంటు స్థలానికి 30వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ పార్టీ బలంగానే ఉందని అన్నారు. త్వరలో నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమిస్తామన్నారు. కొండలను, గుట్టలను వైసీపీ కార్యకర్తలు ఆక్రమిస్తున్నారని దీన్ని ప్రజల్లోకి తీసుకు వెళతామన్నారు. కార్యక్రమంలో జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర,
వివిధ మండలాల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, వి సీతారామయ్య, వి.వెంకటరెడ్డి, పయ్యావుల ప్రసాదు, మాజీ జడ్పీటీసీ జడి లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ దాసరి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శనగా నారాయణరెడ్డి, మేడికొండ లక్ష్మినారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు చిట్యాల వెంగళరెడ్డి, తోకపల్లి టీడీపీ నాయకులు కే అనిల్‌కుమార్, పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీని చేదూరి ప్రభాకరరావు సన్మానించారు.