కంచెదాటిన కబ్జా

ABN , First Publish Date - 2020-04-07T11:08:47+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. ‘సందట్లో సడేమియా’ అన్నట్లు ఓ వ్యక్తి అనంతవరం

కంచెదాటిన కబ్జా

తేటుపురం వద్ద బకింగ్‌ హాం కాలువ ఆక్రమణ

ఐదు ఎకరాల్లో రొయ్యల చెరువుల తవ్వకం

అక్కడే షెడ్‌ నిర్మాణం

కలిసొచ్చిన లాక్‌డౌన్‌

పట్టించుకోని అధికారులు


టంగుటూరు, ఏప్రిల్‌ 6 : కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. ‘సందట్లో సడేమియా’ అన్నట్లు ఓ వ్యక్తి అనంతవరం పంచాయతీ పరిధిలోని తేటుపురం గ్రామం వద్ద బకింగ్‌ హాం కాలువలో పాగా వేశాడు. దర్జాగా రొయ్యల చెరువులను తవ్వుతున్నాడు. కొద్దిరోజులుగా ఈ వ్యవహారాన్ని నిర్విఘ్నంగా అధికారులు పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి మరో అడుగు ముందుకు వచ్చే చెరువు తవ్వుతున్న ప్రాంతంలో షెడ్డును కూడా నిర్మిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. 


తేటుపురం గ్రామం సమీపం నుంచి బకింగ్‌హాం కాలువ ప్రవహిస్తుంది. దీనికి ఆనుకొని ఉన్న భూముల్లో రెండున్నర దశాబ్దాలుగా  రొయ్యల సాగు జరుగుతోంది. ఇక్కడి అసైన్డ్‌, ప్రైవేటు భూముల్లో ఆక్వా చెరువులు వేస్తున్న అనేక మంది కొద్దోగొప్పో బకింగ్‌హాం కాలువ భూమలనూ ఆక్రమించారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏకంగా బకింగ్‌హాం కాలువనే ఆక్రమించాడు. రొయ్యల చెరువులు తవ్వడం ప్రారంభించాడు.  గతంలో ఎకరా బకింగ్‌హాం కెనాల్‌ భూమిలో ఒక చెరువు ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్న ఈవ్యక్తి ఇప్పుడు దాన్ని ఐదు ఎకరాలకు విస్తరించాడు.


సముద్రం పోటు సమయంలో కాలువలోకి వచ్చిన నీరు నక్కలవాగు నుంచి మళ్లీ సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా నిర్మించిన తూములను సైతం పగులగొట్టాడు. ఆక్రమిత ప్రాంతంలోనే ఒక షెడ్డును కూడా నిర్మించాడు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అఽధికారులు పట్టించుకోకుండా ఇలాగే ఉంటే బకింహాం కెనాల్‌ భూములన్నీ రొయ్యల చెరువులుగా మారిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. 


Read more