జాతీయ మీడియాకు ప్రజల సొమ్ములిచ్చి వైసీపీ భజన : విష్ణు

ABN , First Publish Date - 2020-11-07T16:50:24+05:30 IST

జగన్ సర్కార్‌పై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

జాతీయ మీడియాకు ప్రజల సొమ్ములిచ్చి వైసీపీ భజన : విష్ణు

ఒంగోలు : జగన్ సర్కార్‌పై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ పాస్టర్లకు ఇచ్చిన ఐదు వేల రూపాయలపై కేంద్రం విచారణకు ఆదేశించిందన్నారు. మత మార్పిడులకు ప్రోత్సహించిన పాస్టర్లకు ఐదు వేల నగదు ఇవ్వడాన్ని మత ప్రచారంగా భావిస్తున్నామని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు మత ప్రచారానికి ఖర్చు చేయాల్సిన నిధులను ఇతర నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ సర్కార్.. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజల సొమ్మును జాతీయ మీడియాకు ఇచ్చి ప్రభుత్వం భజన చేయించుకుంటోందని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చారు.


పోలవరంను కేంద్రమే నిర్మిస్తుంది..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ నేతలు జగనన్న భజన కార్యక్రమం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తామని చెబుతున్నా మళ్లీ అనవసర రాగ్దాంతం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కచ్చితంగా నిర్మిస్తుంది. ప్రధాని మోదీనే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు అని విష్ణువర్దన్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2020-11-07T16:50:24+05:30 IST