పుట్టిన రోజు నాడే మృత్యువాత

ABN , First Publish Date - 2020-09-05T08:53:38+05:30 IST

స్నేహితులందరూ పుట్టిన రోజు వేడుకలను సరాదాగా చేసుకున్నారు. ఆటపాటలతో గడిపారు. మిత్రులను సాగనంపి తిరుగు ప్రయాణం

పుట్టిన రోజు నాడే మృత్యువాత

బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి

.. మరొకరికి గాయాలు 


గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 4 : స్నేహితులందరూ పుట్టిన రోజు వేడుకలను సరాదాగా చేసుకున్నారు. ఆటపాటలతో గడిపారు. మిత్రులను సాగనంపి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. జన్మదినం నాడే అతడిని మృత్యువు బలిగొంది. ఈ విషాద సంఘటన మండలంలోని తంబళ్లపల్లె సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తంబళ్లపల్లెకు చెందిన ముత్యాల జనార్దన్‌రెడ్డి(18) పుట్టినరోజు కావడంతో గురువారం స్నేహితులంతా కలుసుకుని వేడుకలు చేసుకున్నారు.


అనంతరం వారిని సాగనంపేందుకు జనార్దన్‌రెడ్డి, జగదీ్‌షలు మోటారు సైకిల్‌పై నల్లగుంట్ల వరకూ వెళ్లారు. అక్కడ వారిని వదిలి పెట్టి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. తంబళ్లపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మోటారు సైకిల్‌ అదుపు తప్పింది. ఇద్దరూ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.


జనార్దన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. జగదీష్‌ నంద్యాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. జనార్దన్‌రెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Updated Date - 2020-09-05T08:53:38+05:30 IST