జనరల్‌ మహిళ స్థానంలో బీసీ మహిళ

ABN , First Publish Date - 2020-03-08T10:58:09+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్డ్వ్‌ స్థానాలను ప్రస్తుత వైపీపీ తగ్గించిందని ఆరోపిస్తూ జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలపాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

జనరల్‌ మహిళ స్థానంలో బీసీ మహిళ

వెలిగండ్ల ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నిర్ణయం 


ఒంగోలు , ఫిబ్రవరి7: (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్డ్వ్‌ స్థానాలను ప్రస్తుత వైపీపీ తగ్గించిందని ఆరోపిస్తూ జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి నిలపాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుపై జిల్లాలో తొలిస్పందన కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చింది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరపింహారెడ్డి అందుకు చొరవ తీసుకున్నారు. వెలిగండ్ల మండల పరిషత్‌ అధ్యక్ష పదవి జనరల్‌ మహిళ కేటగిరిలో ఉండగా ఆ పదవికి టీడీపీ తరుపున బీసీ మహిళను పోటీ పెట్టాలని నిర్ణయించారు.


వెలిగండ్ల మండల అభ్యర్థుల ఎంపికపై నాయకులతో శనివారం రాత్రి సమీక్షించిన డాక్టర్‌ ఉగ్ర ఆ మేరకు నిర్ణయించారు. స్థానిక నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానం జనరల్‌ కేటగిరికి కేటాయించగా ఎంపీపీ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా ఆ మండలంలో ముఖ్యుడిగా డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు ఉన్న డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ బీరం వెంకటేశ్వరరెడ్డిని పోటీచేయించాలని తీర్మానించారు. అదే సమయంలో జనరల్‌ మహిళకు రిజర్వు అయిన ఎంపీపీ పదవికి బీసీ మహిళ అయిన యాదవ సామాజికవర్గానికి చెందిన చల్లా పద్మావతిని ఎంపిక చేశారు.


కాగా ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికైన పద్మావతి, కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేతగా గుర్తింపు ఉన్న వెలిగండ్ల మాజీ జడ్పీటీసీ చల్లా సురేంద్రబాబు సతీమణి. అంతే కాక వారి స్వగ్రామైన మొగళ్లూరు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కూడా. అయితే ప్రస్తుతం మొగళ్ళూరు ఎంపీటీసీ స్థానం ఎస్సీ కేటగిరిలోకి పోవడంతో తమకు పట్టు ఉన్న రాళ్ళపల్లి, లేదా కంకణంపాడుల్లో ఒకదానిని నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

Updated Date - 2020-03-08T10:58:09+05:30 IST