జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య ఆధిపత్య పోరు విషయం ప్రస్తావన..!

ABN , First Publish Date - 2020-06-26T21:03:28+05:30 IST

జిల్లాకు సంబంధించి పాలన, రాజకీయ వ్యవహారాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం

జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య ఆధిపత్య పోరు విషయం ప్రస్తావన..!

ఒంగోలు స్థల విషయం సీఎం దృష్టికి!

ఇళ్ల పట్టాల పంపిణీపై జగన్‌తో బాలినేని భేటీ


ఒంగోలు (ఆంధ్రజ్యోతి): జిల్లాకు సంబంధించి పాలన, రాజకీయ వ్యవహారాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలినేని సీఎంను కలిశారు. తొలుత ఆయన శాఖలకు సంబంధించిన కొన్ని అంశాలపై మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమ సమాచారాన్ని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. లక్షా 31వేల మందికి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైందని అయితే కొన్ని పట్టణ ప్రాంతాల్లో స్థలాల సేకరణలో ఇబ్బందులున్నాయని వివరించారు. ఆ సందర్భంగా చీరాల, కందుకూరుతోపాటు ఒంగోలు వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఒంగోలుకు సంబంధించి యరజర్ల వద్ద స్థల సేకరణకు ఐరన్‌ఓర్‌ వ్యాపార సంస్థతో కోర్టులో ఉన్న ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని చెప్పినట్లు తెలిసింది.


 ఆ ప్రాంతాన్ని మినీ పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చేసుకసునేందుకు మంచి అవకాశాలున్నాయని అందువల్ల ఎక్కువమందికి అవకాశం ఇస్తూ స్థలాన్ని ఎంపికచేసినట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నివాసిత ప్రాంతాలకు దూరంగా స్థలాలను ఎంపిక చేయాల్సి వచ్చినా పట్టాదారులకు ఇబ్బందిలేకుండా కాలనీలు అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని చెప్పినట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో స్థలాల సేకరణ అభివృద్ధి పనులకు సంబంధించి ఎదురైన సమస్యలు, వచ్చిన ఆరోపణల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, పొగాకు కొనుగోళ్లకు మార్కెట్‌ను రంగంలోకి దింపాలన్న సీఎం నిర్ణయం పట్ల రైతుల్లో పూర్తి సానుకూలత వచ్చిందని, ఆ విషయంలో మరింత వేగంగా చర్యలు తీసుకుంటే మంచిఫలితం వస్తుందని చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పార్టీపరంగా నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఎదురవుతున్న సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని సూచనలు సీఎం సూచించినట్లు సమాచారం. ఒకరిద్దరి అధికారుల బదిలీల వ్యవహారం వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. 

Updated Date - 2020-06-26T21:03:28+05:30 IST