-
-
Home » Andhra Pradesh » Prakasam » bad poverty ruling
-
దరిద్రపు పాలన
ABN , First Publish Date - 2020-12-30T05:42:45+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వమంత దరిద్రపు పాలన మునుపెన్నడూ చూడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జిల్లాలో త్రిపురాంతకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిలో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మిరప, బొప్పాయి తోటలను పరిశీలించారు.

ఇలాంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు
రైతులను ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యతను
విస్మరించి విమానాల్లో తిరగడమా!అన్న వచ్చాడు.. వరదలొచ్చి మొత్తం పోయాయి..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజం
నివర్ తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల పరిశీలన
మార్కాపురం, డిసెంబరు 29 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వమంత దరిద్రపు పాలన మునుపెన్నడూ చూడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జిల్లాలో త్రిపురాంతకం మండలం మేడపి, దోర్నాల మండలం యడవల్లిలో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మిరప, బొప్పాయి తోటలను పరిశీలించారు. మేడపి, యడవల్లిలో కల్లాల్లో ఆరబోసిన రంగుమారిన మిరపకాయలను, యడవల్లిలో నేలకొరిగిన బొప్పాయి పంటను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగుచేశారు. దిగుబడి ఎంత, నష్టం ఎంత వంటి వివరాలను ముఖాముఖీ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అన్న వస్తే వర్షాలొస్తాయన్నారు... ఏడుసార్లు వరదలొచ్చి పంటలన్నీ కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పనిచేసిన కాలంలో ప్రజాసమస్యలను పరిష్కరించడానికి నిర్ధిష్టమైన యంత్రాంగం ఉండేదన్నారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైజాగ్‌లో 28 రోజులు ఉండి సమస్యలు తీరిన తర్వాతే అక్కడ నుంచి వచ్చారన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని సీఎం విస్మరించారన్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పారన్నారు. నవరత్నాల అమలులో మాట తప్పం... మడమ తిప్పం అని ఫేక్ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి పరిగెడుతున్నారన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి రైతులకు హెక్టారుకు రూ.30వేలు, ఉద్యాన పంటల రైతులకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు పాలనా కాలంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తక్షణమే రూ.3,500కోట్లు విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రికి విమానాల్లో తిరగడానికి, వ్యవసాయశాఖ మంత్రికి రికార్డింగ్ డ్యాన్స్‌ల పట్ల ఉన్న శ్రద్ధ దెబ్బతిన్న పంటలను చూడడానికి లేదని ఎద్దేవా చేశారు. గ్రామస్థాయిలో తమ సమస్యలను తీర్చాలని అడిగిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసరాజ్యం నెలకొల్పారన్నారు. రంగు మారిన మిర్చికి గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
లోకే్‌షకు ఘనస్వాగతం
తుఫాన్ కారణంగా దిబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు జి.ఉమ్మడివరం గ్రామానికి ఉదయం 11.15కు చేరుకున్న లోకే్‌షకు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, రాష్ట్ర కార్యదర్శి షేక్ కరిముల్లా, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కుసుమకుమారి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయనకు గ్రామగ్రామానా ప్రజలు పూలవర్షం కురిపించారు. మేడపిలో మహిళలు లోకేష్‌కు తిలకం దిద్ది హారతులిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డి.బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల మండలం యడవల్లి గ్రామంలో ఈ నెల 22న మృతి చెందిన టీడీపీ కార్యకర్త తెల్లమేకల శ్రీనివాసరావు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. శ్రీనివాసరావు ముగ్గురు కొడుకులను తన కుమారుడు దేవాన్ష్‌తో సమానమని, వారిని బాగా చదివిస్తానని లోకేష్ చెప్పారు.
నేడు కనిగిరికి లోకేష్ : డాక్టర్ ఉగ్ర వెల్లడి
కనిగిరి, డిసెంబరు 29 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం కనిగిరికి రానున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత హత్య నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ యన వెళుతున్నట్లు వివరించారు. మార్గమధ్యంలో కనిగిరిలో ఆగి పార్టీ శ్రేణులతో ముఖాముఖీలో పాల్గొంటారని ఉగ్ర వెల్లడించారు. జిల్లాలోని యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కనిగిరి ప్రాంతానికి రావాల్సిందిగా తన ఆహ్వానాన్ని మన్నించి బుధవారం కనిగిరి వస్తున్నట్లు ఆయన తెలిపారు. కనిగిరి పట్టణంలోని పామూరు రోడ్డు బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు ఎదుట ఉన్న అమరావతి గ్రౌండ్స్‌లో ఉదయం 7 గంటలకు లోకేష్ కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు. టీడీపీ శ్రేణులు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

