రాష్ట్రంలో నిరంకుశ పాలన
ABN , First Publish Date - 2020-09-12T10:17:18+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ధ్వజం
ఒంగోలు(కలెక్టరేట్), సెప్టెంబరు 11 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అంతర్వేది గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన విషయం హిందువుల హృదయాలను దారుణంగా గాయపర్చిందన్నారు. ఈ సంఘటన అనంతరం ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు ఇంకా క్రూరంగా ఉందని చెప్పారు. ఇటీవల మార్కాపురంలోని చెన్నకేశవస్వామి దేవస్థానం భూమిలో వైసీపీ నాయకులు వేబ్రిడ్జి నిర్మించారన్నారు. ఇలా హిందూ దేవాలయ ఆస్తులను అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అంతర్వేది సంఘటన సహా రాష్ట్రంలో గతేడాది కాలంగా దేవాలయాలపై జరిగిన దాడులతోపాటు ఆస్తుల కబ్జాపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌చేశారు. ధర్నాకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. అనంతరం డీఆర్వో వినాయకంను కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు దారా సాంబయ్య, పీవీ కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, శెగ్గం శ్రీనివాసరావు, డాక్టర్ కొమ్మి నరసింగరావు, కొమ్ము శ్రీనివాసులు, కే రాఘవులు, రావులపల్లి నాగేంద్రయాదవ్, కోటేశ్వరి, సత్యవతి, భువనేశ్వరి, శివాజీ, వినోద్ భగత్ పాల్గొన్నారు.