సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-02-20T10:58:05+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాన్ని గురువారం ఆయన

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

 పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 19 : సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాన్ని గురువారం ఆయన సందర్శించనున్నారు.అందుకు తగిన ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ షన్మోహన్‌, ఎస్పీ సిద్ధార్ధ కౌశిల్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. హెలీకాప్టర్‌ దిగే హెలీప్యాడ్‌ నిర్మాణం నుంచి రోడ్డు మార్గం ద్వారా రెండో సొరంగం, మొదటి సొరంగం వరకు రోడ్డు మరమ్మతులు నిర్వహించారు.


రోడ్డుకు ఇరువైపుల, హెలీప్యాడ్‌ పరిసరాల చుట్టూ, వీఐపీ గ్యాలరీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటికి వైఎస్సార్‌ జెండా రంగులు అద్దారు.మొదటి సొరంగం నిర్మాణ పనులకు సమీపంలో అధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం హాలును,  దీనికి సమీపంలో వీఐపీలకు, విలేకరులకు వేర్వేరుగా షెడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఎస్పీ సిద్ధార్ధ కౌశిల్‌ పదుల సంఖ్యల్లో కాన్వాయి వాహనాలతో సహా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. బుధవారం నుంచే కొత్తూరు గ్రామం నుంచి మోట్ల వరకు కర్నూలు రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్డు పొడవునా బాంబ్‌ స్క్వాడ్‌, కూంబింగ్‌ పార్టీ నిశితంగా పరిశీలించారు. హెలీకాప్టర్‌ కూడా గాలిలో చక్కర్లు కొట్టీ హెలీప్యాడుపై ల్యాండ్‌ అయ్యింది. పంచాయతీ జిల్లా అధికారులు పారిశుధ్యం పనులను ఇప్పటికే చేపట్టారు.


ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సీఐ మారుతీ కృష్ణ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 7 గురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 100 మంది స్పెషల్‌ పార్టీ, 45 ఏరియా డేమినేషన్‌ సిబ్బంది, 40 ఆర్‌వోపీతో పాటు  వెయ్యి మంది పోలీసులను నియమించినట్టు తెలిపారు. వైఎస్సార్‌ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సీఎం వెలుగొండ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-02-20T10:58:05+05:30 IST