ఏపీ పోలీస్ దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2020-09-12T10:16:21+05:30 IST
రాష్ట్రంలో పోలీ్‌సవ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

ప్రాణాలను లెక్కచేయకుండా కొవిడ్ విధుల నిర్వహణ
కరోనా బారిన పదివేల మంది పోలీస్ సిబ్బంది
మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్‌పరేడ్‌లో హోంమంత్రి సుచరిత
మంత్రులు బాలినేని, సురేష్, డీజీపీ సవాంగ్ హాజరు
ఒంగోలు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పోలీ్‌సవ్యవస్థ సమర్థంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనూ ముందు ఉందని కొనియాడారు. స్థానిక పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 2019-20 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సుచరిత మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. దాదాపు పదివేల మంది సిబ్బంది కరోనా బారినపడ్డారని చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారాంతపు సెలవులు ఇవ్వడంతో వారిలో మానసిక ఒత్తిడి తగ్గిందని తెలిపారు.
పోలీసులు, హోంగార్డులకు బీమా సౌకర్యం, హోంగార్డులకు ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీ్‌సశాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో కలుగుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్ మాట్లాడుతూ దిశ చట్టంతో మహిళలకు ప్రత్యేక రక్షణ, స్పందన ద్వారా ప్రజల వినతులకు సత్వర పరిష్కారంలో ముందు ఉన్నామన్నారు. అక్రమ మద్యం, ఇసుక రవాణా నివారణ కోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. కాగా శిక్షణ పూర్తి చేసుకున్న 398 మంది మహిళా పోలీసులకు నియామక పత్రాలను రాష్ట్రమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లతో కలిసి హోం మంత్రి సుచరిత అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పీటీసీ ప్రిన్సిపాల్ చిరంజీవి పాల్గొన్నారు.