చుక్కల్లో కూరగాయలు !

ABN , First Publish Date - 2020-06-25T11:16:20+05:30 IST

కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజానీకం వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి

చుక్కల్లో కూరగాయలు !

ఏ రకమైనా కిలో రూ.50పైనే

భారీగా పెరిగిన పండ్ల ధరలు

వాపోతున్న కొనుగోలుదారులు


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 24 : కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజానీకం వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి విడత లాక్‌డౌన్‌లో అన్ని రకాల కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయి. రెండో విడత జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒక్కసారిగా అన్ని రకాల కూరగాయాల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోల్‌ సెల్‌లో కొన్ని రకాల కూర గాయలు కిలో రూ.50 పలుకుతుండగా రిటైల్‌లో మరో రూ.10 అదనంగా విక్రయిస్తున్నారు. ఇళ్ల వెంబడి తిరిగి విక్రయించే వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. కాగా నిన్నా మొన్నటి వరకు టమోటా, పచ్చిమిర్చి ధరలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం హోల్‌సెల్‌లోనే పచ్చిమిర్చి మొదటి రకం రూ.60 నుంచి రూ.70 పలుకుతుండగా రిటైల్‌గా రూ.80లకు విక్రయిస్తున్నారు. ఇక ఇళ్ల వెంబడి తిరిగి విక్రయించే వ్యాపారులు పావు కిలో రూ.25కు అమ్ముతున్నారు. టమోటా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మార్కెట్లో కిలో టమోటా రూ.50 ఉండగా రిటైల్‌గా రూ.60 పలుకుతున్నది. పెద్ద చిక్కుళ్ళు, క్యారెట్‌ కూడా కిలో రూ.50 పైనే ధరలు ఉన్నాయి. నిన్నామొన్నటి వరకు కిలో రూ.25 పలికిన బంగాళదుంప ప్రస్తుతం రూ.40కి చేరింది. బెండ,దొండ, కాకర, చామదుంప, దోస, చిన్న చిక్కుళ్ళు, వంకాయ తదితర రకాల కూరగాయాలు కిలో రూ.25 నుంచి రూ.40 పలుకుతున్నది. 


పండ్ల ధరలూ అంతే...

పండ్లు(ప్రూట్స్‌) ధరలు కూడా భారీగా పెరిగాయి.  దీంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిన్నా మొన్నటి వరకు మొదటి రకం యాపిల్‌ పండ్లు ఒక్కొక్కటి రూ.20లకు లభించగా ప్రస్తుతం రూ.30కి చేరింది. రెండో రకం యాపిల్స్‌ రూ.100లకు  ఏడేనిమిది పండ్లు రాగా ప్రస్తుతం నాలుగు పండ్లకు మించి ఇవ్వడం లేదు. ద్రాక్ష కిలో రూ.100 నుంచి రూ.150 పలుకుటోంది. దానిమ్మ ధరలు కూడా అదే విధంగా ఉన్నాయి. నిన్నా మొన్నటి వరకు ఒక్కొక్కటి రూ.20కి లభించగా ప్రస్తుతం రూ.30లకు విక్రయిస్తున్నారు. అరటిపండ్లు డజను రూ.50పైనే పలుకుతున్నాయి. ఈవిధంగా అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2020-06-25T11:16:20+05:30 IST