-
-
Home » Andhra Pradesh » Prakasam » A 50 bed ward should be prepared for corona patients
-
కరోనా రోగులకు50 పడకల వార్డు సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2020-03-13T11:12:17+05:30 IST
రిమ్స్ వైద్యశాలలో కరోనా రోగుల కోసం 50 పడకల వార్డును సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశం

ఒంగోలు నగరం, మార్చి 12: రిమ్స్ వైద్యశాలలో కరోనా రోగుల కోసం 50 పడకల వార్డును సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశం ఆదేశించారు. నెల్లూరులో కరోనా కేసు నమోదు కావటంతో ఈ ఆదేశాలను జారీ చేశారు. ఆయన గురువారం రిమ్స్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రిమ్స్‌లో 10 పడకల వార్డు కరోనా రోగుల కోసం సిద్ధంగా ఉండగా దానిని 50 పడకలకు పెంచాలని డీఎం ఈ కోరారు. అవసరమైతే ఇతర వార్డుల్లోని వాటిని కూడా ఇందు కోసం ప్రత్యేకంగా కేటాయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్నిచర్యలు చేపడుతుందన్నారు. దీనిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రిమ్స్‌లో అన్నిఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా అనుమానిత రోగుల వివరాలను వెంటనే తెలియజేయాలన్నారు. వారిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యం అందించాలన్నారు. విదేశాలనుంచి వచ్చిన వారికి స్ర్కీనింగ్ తప్పని సరి అని ఆయన అన్నారు. వీడియో సమావేశంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, ఆర్‌ఎంవో డాక్టర్ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరానోతో బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు
కోరలు చాస్తున్న కరోనాకు ప్రభుత్వ కార్యాయాల్లో చెక్ పెట్టేందుకు ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు , ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌సోకకుండా ఉండేందుకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు బయోమెట్రిక్ హాజరు నిలిపివేయమని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యాలయాలు, పాఠశాలల హాజరు రిజిస్టర్‌లో సంతకం చేస్తే సరిపోతుంది.