21న భూహక్కు-భూరక్ష పథకం ప్రారంభం : జేసీ

ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ఈనెల 21న ప్రారంభమవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(ఆర్‌అండ్‌ ఆర్‌) హరేందిర ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

21న భూహక్కు-భూరక్ష పథకం ప్రారంభం : జేసీ

నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ఈనెల 21న ప్రారంభమవుతుందని జాయింట్‌ కలెక్టర్‌(ఆర్‌అండ్‌ ఆర్‌) హరేందిర ప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకంలో అన్ని రకాల భూములు సర్వే చేస్తారన్నారు. మొదటి విడతలో జిల్లాలో 400 గ్రామాలను ఎంపిక చేశారని, వాటిలో నెల్లూరు డివిజన్‌లో 104, కావలి డివిజన్‌లో 56, గూడూరు డివిజన్‌లో 113, ఆత్మకూరు డివిజన్‌లో 61, నాయడుపేట డివిజన్‌లో 66 గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. ఆ గ్రామాల్లో రెండేళ్ల కాల వ్యవధిలో ఎలాంటి వివాదాలు రాని భూములకు శాశ్వత భూహక్కు కల్పించటం జరుగుతుందన్నారు. రీ సర్వే కార్యక్రమాలు నిర్వహించడానికి జిల్లాలో ఐదు చోట్ల సీవోఆర్‌ఎస్‌ నెట్‌ వర్క్‌ బేస్‌ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. రాపూరులోని ఇరిగేషన్‌ డీఈ కార్యాలయంలో,  చిట్టమూరు తహసీల్దార్‌ కార్యాలయం, విడవలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో, కలిగిరిలో గ్రామ సచివాలయ కార్యాలయం, ఉదయగిరి తహిసీల్దార్‌ కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేస్తారన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన వెంటనే డివిజన్‌కు ఒక గ్రామం వంతున రీసర్వే ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 21కు ముందే మొదటి విడతకు సంబంధించిన 400 గ్రామాల్లో గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూముల హద్దులు పునరుద్ధరిస్తారని, గ్రామ కంఠాలు, కమతాలను గుర్తిస్తారని తెలిపారు. ఈ రీ సర్వేలో తలెత్తే సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, న్యాయపరమైన సమస్యలకు సంబంధించి మండలానికి ఒక బృందం ఉంటుందని తెలిపారు. మొదటి విడత భూముల సర్వేను ఈనెల 21న ప్రారంభించి 2021 జూలై నాటికి పూర్తి చేస్తారన్నారు.  

Updated Date - 2020-12-10T05:30:00+05:30 IST