పొలం దాటని పసుపు

ABN , First Publish Date - 2020-04-26T10:28:54+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దిగుబడులు చేతికందినా అమ్మే అవకాశాలు లేక..

పొలం దాటని పసుపు

 లాక్‌డౌన్‌తో రైతులకు ఇబ్బందులు

 మూతపడిన యార్డులు

 ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వినతి


ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 25 : లాక్‌డౌన్‌ కారణంగా పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దిగుబడులు చేతికందినా అమ్మే అవకాశాలు లేక ఆవేదన చెందుతున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఉదయగిరి సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, ఉదయగిరి మండలాల్లో సుమారు 1000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. ప్రధానంగా ఉదయగిరి మండలం బండగానిపల్లి, బిజ్జంపల్లి, కొత్తపల్లి, కృష్ణారెడ్డిపల్లి, లింగంనేనిపల్లి, జీ.అయ్యవారిపల్లి, చెర్లోపల్లి తదితర గ్రామాల్లో 500 ఎకరాల వరకు పసుపు పంట సాగు చేశారు. మార్చి మొదటి వారం నుంచి రైతులు పసుపు తవ్వకాలు చేపట్టి పొలాల్లో రాశులు పోశారు. 


ఆశాజనకంగా దిగుబడి

ఈ ఏడాది పసుపు దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. ఎకరాకు ఒక్కో రైతుకు 40-60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఫిబ్రవరి 19న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని సవరిస్తూ మార్చి 31న మరో జీవో జారీ చేసింది. క్వింటా రూ.6,875లు మద్దతు ధరతో ప్రతి రైతు నుంచి 30 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కానీ కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో యార్డులు మూతపడ్డాయి. దీంతో రైతులు దిగుబడులను నివాసాలు, పొలాల్లోనే ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. 


దిగజారిన ధర 

ప్రస్తుతం పచ్చి పసుపు పుట్టి రూ.2 వేలు పలుకుతుండగా వట్టి పసుపు క్వింటా రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు పలుకుతోంది. ఎకరా పసుపు పంట సాగు చేసేందుకు సుమారు రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుందని, ఈ ధరలతో పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 


ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. కాకు వెంకటయ్య, రైతు సంఘం నాయకులు

పసుపు పంటకు బయట మార్కెట్‌లో ధర లేకపోవడంతో  ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులంతా దిగుబడులను పొలాలు, ఇళ్ల నిల్వ ఉంచుకుని వాటికి కాపలా కాయాల్సి వస్తుంది. 


పెట్టుబడులు కూడా కష్టమే .. బండి ప్రసాద్‌, రైతు, కృష్ణారెడ్డిపల్లి

పసుపు పంటకు ప్రస్తుతం పలుకుతున్న ధరతో పెట్టుబడులు కూడా రావు. ఎకరా పంట సాగుకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. క్వింటా వట్టి పసుపు రూ.4,500లకు అడుగుతున్నారు. ఈ ధరతో రైతులు నష్టపోవాల్సిందే. 

Updated Date - 2020-04-26T10:28:54+05:30 IST