వైభవంగా ముక్కోటి ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:00:51+05:30 IST

పట్టణంతో పాటు మండలంలోని పలు వైష్ణవాలయాలు, శివాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

వైభవంగా ముక్కోటి ఏకాదశి
బుచ్చి పెద్దూరులోని ఆలయంలో దర్శనమిస్తున్న శ్రీ కోదండరామస్వామి.

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు


బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 25: పట్టణంతో పాటు మండలంలోని పలు వైష్ణవాలయాలు, శివాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. బుచ్చిరెడ్డిపాళెం పెద్దూరులోని ఆలయంలో సీతా లక్ష్మణ సమేతుడిగా శ్రీ కోదండరామస్వామి  భక్తులకు  దర్శనమిచ్చారు. అలాగే జొన్నవాడలో శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జొన్నవాడలోనే శ్రీదేవి, భూదేవి సమేతుడిగా శ్రీ వరదరాజస్వామి అంతరాలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దక్షిణముఖంతో కొలువై ఉన్న ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుచ్చి, జొన్నవాడ ఆలయాల్లో చేసిన ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ భక్తులను కనువిందు చేశాయి. శుక్రవారం వేకువజాము నుంచి ఆలయాల్లో స్వామి వార్ల  వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమాలను బుచ్చిలో ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళికృష్ణారెడ్డి, జొన్నవాడ ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అలాగే బుచ్చిలోని శివాలయం, బాబా మందిరం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకృష్ణ మందిరంతో పాటు మండలంలోని కాగులపాడు, పెనుబల్లి,, రేబాల, దామరమడుగు, మినగల్లు తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పొదలకూరు: మండలంలోని వైష్ణవ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభంగా జరిగాయి. పట్టణంలోని అయ్యప్పనగర్‌, శ్రీనివాసనగర్‌లో వెలసి ఉన్న కళ్యాణవెంకటేశ్వరస్వామి, లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వేదపండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి - భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కల్యాణానికి అధిక మంది మహిళా భక్తులు హాజరయ్యారు.

మనుబోలు: ముక్కోటీ ఏకాదశి సందర్భంగా శుక్రవారం మండలంలో ఉన్న వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. మనుబోలులోని విష్ణాలయం, పిడూరులోని చెన్నకేశవస్వామి ఆలయం, లక్ష్మీనరసింహపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. అలాగే ఆలయాల్లోని మూలవిరాట్‌లకు అర్చకులు వేదమంత్రాలతో  పూజలు నిర్వహించారు. మనుబోలులో దేవేర్లతో కూడిన స్వామి ఉత్సవమూర్తులను గజమాలలతో అలంకరించి పల్లకీపై ఆలయ ప్రదక్షణ చేయించారు. సాయంకాలం పూలంగాసేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు పెనుగొండ సుధాకర్‌, శాంతి దంపతుల ఉభయదాతలుగా వ్యవహరించారు. పిడూరులో, లక్ష్మీనరసింహపురంలో స్వామివారిని గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. 

Updated Date - 2020-12-26T05:00:51+05:30 IST