ఇసుక అక్రమం.. సొమ్ము స్వాహాపర్వం.. విజిలెన్స్‌కు చిక్కిన కాంట్రాక్టర్లు

ABN , First Publish Date - 2020-12-16T03:43:21+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14వ ఆర్థిక సంఘం కింద రూ.60 కోట్లతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు.

ఇసుక అక్రమం.. సొమ్ము స్వాహాపర్వం.. విజిలెన్స్‌కు చిక్కిన కాంట్రాక్టర్లు
నెల్లూరు : శ్రామిక్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న రోడ్డు

నెల్లూరులో రూ.145 కోట్లతో పనులు

ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌, సిప్‌ నిధుల కింద టెండర్లు

అధికార పార్టీ నేతలకే పనులు?

బిల్లు ఇస్తామన్నా.. బ్లాకులో ఇసుక కొనుగోలు

ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసే కుట్ర

రంగంలోకి విజిలెన్స్‌.. రికవరీకి చాన్స్‌!

తప్పించుకునేందుకు తెర వెనుక పైరవీలు

కార్పొరేషన్‌ అధికారుల పాత్రపైనా ఆరా


రాజకీయ బలంతో టెండర్లు దక్కించుకున్నారు.. నాసిరకంగా పనులు చేశారు.. పైగా టెండర్‌లో ప్రభుత్వం ఇసుకకు బిల్లు ఇస్తే దాని ప్రకారం అధికారికంగా రీచ్‌లలో కొనుగోలు చేయకుండా అక్రమంగా ఇసుకను తరలించి పనులు చేశారు.. తద్వారా ఒక్కొక్కరు రూ.లక్షలు వెనకేసుకోవచ్చని కుట్ర పన్నారు.. కానీ చివరకు వారి ఆశలు, కుట్రలు భగ్నమయ్యాయి. ఈ  అక్రమాలు విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలుపెట్టారు. చాలామంది కాంట్రాక్టర్ల బిల్లుల్లో రికవరీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లంతా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా జరిగింది నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కాగా ఎక్కువగా పనులు చేసింది అధికార పార్టీకు చెందిన వారు కావడం గమనార్హం. 


నెల్లూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14వ ఆర్థిక సంఘం కింద రూ.60 కోట్లతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. ఇప్పటికి 80 శాతం పనులు పూర్తవగా, రూ.12 కోట్ల బిల్లులను కార్పొరేషన్‌ అధికారులు చెల్లించారు. మిగతా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే జనరల్‌ ఫండ్‌ కింద రూ.3.60 కోట్లతో పలు వర్కులకు టెండర్లు పిలిచారు.  ఇవి కూడా 80 శాతం పూర్తవగా, ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. ఇక సిప్‌ నిధుల కింద రూ.80 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగా ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్ల పేర్లపై అధికార పార్టీ నేతలు చేజిక్కించుకున్నారు. గతంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను టెండర్లు వేయనీయకుండా బెదిరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ప్రతి టెండర్‌లోనూ ఆ వర్కుకు సంబంధించి మెటీరియల్‌, లేబర్‌ ఖర్చులను అంచనా వేసి ఆ ప్రకారమే ధరను నిర్ణయిస్తారు. గతంలో ఇసుక ఉచితం కాబట్టి సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి పనులకు కేవలం సిమెంటు, కంకర, లేబర్‌, గ్రావెల్‌కు మాత్రమే బిల్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఇసుక ఉచితం కాదు కాబట్టి ఆ ధరను కూడా కొత్తగా పిలుస్తున్న వర్కుల్లో కలుపుతున్నారు. ఇసుక టన్ను ధర దాదాపు రూ.400 వరకు ఉంది. ఈ రేటుతో పిలిచిన వర్కులకు నిబంధనల ప్రకారం ఇసుకను బుక్‌ చేసుకొని ప్రభుత్వానికి ఆ మొత్తం చెల్లించి కొనుగోలు చేసి పనుల్లో ఉపయోగించాల్సి ఉంది. కానీ నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో చేసిన పనులకు చాలా మంది కాంట్రాక్టర్లు ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోలేదని తెలుస్తోంది. తమకున్న అధికార బలంతో అక్రమంగా ఇసుకను తరలించి పనులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి  బిల్లులు కూడా చెల్లించారు. మరికొంత మందికి బిల్లులు చెల్లించేందుకు  అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారాలను కొందరు రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేయగా వారు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా విజిలెన్స్‌ అధికారులు కార్పొరేషన్‌ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌, సిప్‌ నిధుల కింద జరిగిన టెండర్లు, పనులు, బిల్లుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీల్లో చాలా మంది ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేయకుండానే పనులు పూర్తి చేసినట్లుగా విజిలెన్స్‌ గుర్తించినట్లు సమాచారం. వీరిలో పలువురు ఇప్పటికే బిల్లులు కూడా పొందడం గమనార్హం. అధికారుల పాత్రపైనా విజిలెన్స్‌ విచారిస్తుండటంతో వారిలోనూ వణుకు మొదలైంది. విచారణ అనంతరం కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రికవరీకి విజిలెన్స్‌ సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో అనధికారికంగా ఇసుకను తరలించారు కాబట్టి కాంట్రాక్టర్లపై చర్యలకూ అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. కాగా ఇదే సమయంలో పలువురు దొంగ బిల్లులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండగా, మరికొంత మంది పనులు చేసిన నేతలు తమ ముఖ్యుల వద్ద తిష్ఠ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధుల ద్వారా బయటపడేందుకు తెరవెనుక జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కార్పొరేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద నెల్లూరులో చేపట్టిన పలు రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. ఇటీవల కమిషనర్‌ దినే్‌షకుమార్‌ ఈ రోడ్ల నాణ్యతను పరిశీలన చేయించారు. నాలుగు రోడ్లకు సంబంధించి ఆ పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి రికవరీకి ఆదేశించడం గమనార్హం. 


విజిలెన్స్‌ అధికారులు వివరాలు ఇవ్వమన్నారు 

నగరంలో ఎన్ని వర్కులు చేశారు.. వాటికి ఇసుక ఎంత ఉపయోగించారు.. ఎక్కడి నుంచి ఇసుక తెచ్చారు.. అన్న వివరాలు ఇవ్వాల్సిందిగా విజిలెన్స్‌ అధికారులు సూచించారు. ఆ వివరాలను తయారు చేసి అందిస్తాం. ఇసుక పోర్టల్‌ నుంచే ఇసుకను బుక్‌ చేశారు. 

- సంజయ్‌, నెల్లూరు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈ

Updated Date - 2020-12-16T03:43:21+05:30 IST