కరోనా టెస్ట్‌ ఎక్కడ ?

ABN , First Publish Date - 2020-07-28T11:07:04+05:30 IST

జలుబు, తలనొప్పి, గొంతులో గరగర, ఒళ్లునొప్పులు, విరేచనాలు, కాస్త జ్వరం ఉన్న ఫీలింగ్‌...

కరోనా టెస్ట్‌ ఎక్కడ ?

జిల్లా కేంద్రంలోనా.. స్థానిక ఆసుపత్రిలోనా ?

ఆ రెండుచోట్ల కాకుండా ‘సంజీవని’లోనా?

ఏఎన్‌ఎంను సంప్రదిస్తే సులభంగా పని

అనుమానం వస్తేనే చేయించండి !


ఆత్మకూరు, జూలై 27 : జలుబు, తలనొప్పి, గొంతులో గరగర, ఒళ్లునొప్పులు, విరేచనాలు, కాస్త జ్వరం ఉన్న ఫీలింగ్‌... వీటిలో ఏ లక్షణం ఉన్నా కరోనా వైరస్‌ మనల్ని తాకిందేమో అనే అనుమానం వస్తుంది. అది భయంగా మారి లోలోపల తొలుస్తూ ఉంటుంది. కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిద నిపిస్తుంది. నెగటివో, పాజిటివో తేలితే తప్ప మనసు కుదటపడదు. మరి కరోనా టెస్ట్‌ ఎక్కడ చేయించుకోవాలి..? కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో చాలా మందిని వేదిస్తున్న ప్రశ్న ఇది. 


నెల్లూరుకి పరుగులు

అత్యధికులు నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీస్తున్నారు. తెల్లవారక ముందే అక్కడ క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. దీంతో అక్కడ ఒకటే తొక్కిసలాట. గంటలు గంటలు నిరీక్షణ. సాయంత్రం వరకు క్యూలైన్‌లో నిలబడ్డా ఒక్కోసారి టోకెన్‌ ఇచ్చి రేపు రండి.. అని చెబుతున్న దాఖలా లు లేకపోలేదు. ఇంత శ్రమపడి టెస్ట్‌ చేయించుకున్నాక కూడా రిపోర్టు ఎప్పుడొస్తుందో తెలియదు. రోజూ ఎదురు చూడడం తోనే సరిపోతుంది. ఈ లోగా భయం భూతంలా మారి వేధిస్తూనే ఉంటుంది. ఇంతశ్రమతో పరీక్ష చేయించుకోనవస రం లేదు.


 ఒక్క ఫోన్‌ కాల్‌తోనే..

 ఓ ఫోన్‌కాల్‌ ద్వారా నిర్ణీత సమయంలో వెళ్లి టెస్ట్‌ చేయించుకోవచ్చు. నెల్లూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోజుకు 1500కుపైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రిలో ఒత్తిడి విపరీతంగా ఉంది. ఇక నెల్లూరులోని భక్తవత్సలనగర్‌లో ఉన్న జీఎఫ్‌ఐడీలో కరోనా టెస్ట్‌లు నిర్వ హిస్తారు. ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో, కావలి ఏరియా వైద్యశాలలో కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇక్కడ స్వాబ్‌ తీసుకుని ఆర్టీపీసీఆర్‌ మెషిన్‌లో పరీక్షించి ఫలితం ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో చేసే టెస్ట్‌లు 90 శాతం కరెక్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఇక సంజీవని వాహనం అందుబా టులో ఉన్నప్పుడు శ్రమలేకుండా కరోనా టెస్ట్‌ చేయించుకో వచ్చు. 


 ఏఎన్‌ఎం సహకారంతో..

 కరోనా వైరస్‌ లక్షణాలు  కనిపించగానే  సంబంధిత వార్డు ఏఎన్‌ఎంకు సమాచారం ఇవ్వాలి. ఏఎన్‌ఎం ఫోన్‌ నెంబరు మీ దగ్గర లేకుంటే వార్డు వలంటీరును సంప్రదించ వచ్చు.


ఏఎన్‌ఎం మీ లక్షణాలను తెలసుకుంటారు. ఆమెకు కొవిడ్‌ అని అనుమానం వస్తే వెంటనే మీ ఆధార్‌, ఫోన్‌ నెంబరు తీసుకుంటారు.


కొవిడ్‌-19 కమిటీకి, సమీప వైద్యాధికారికి మీ సమాచారాన్ని ఏఎన్‌ఎం ఇస్తారు. మీకు కొవిడ్‌ రిజిష్టర్‌ నెంబర్‌ ఇస్తారు. ఇదంతా ఒక రోజులో పూర్తవుతుంది. 


మరుసటి రోజు మీ దగ్గరలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలల్లో, ఏరియా వైద్యశాలల్లో, హెల్త్‌ సెంటర్‌లో లేక సంజీవని వాహనంలో దగ్గర ఉండి మీకు కొవిడ్‌ టెస్ట్‌ను ఏఎన్‌ఎం చేయిస్తారు.


రిపోర్టు వచ్చాక పాజిటవ్‌ అయితే క్వారంటైన్‌ కేంద్రానికి పంపిస్తారు. హోం క్వారెంటైన్‌ కోరుకుంటే పల్స్‌ ఆక్సీమీటర్‌, మాస్కులు, మాత్రలున్న కిట్‌ ఇస్తారు. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఆ తరువాత కూడా ఏఎన్‌ఎం రోజూ మిమ్మల్ని పలకరిస్తూ.. ఆరోగ్య వివరాలు తెలుసుకుంటూ ఉంటారు.


అనుమానం వస్తేనే చేయించుకోండి

మాటిమాటికి కొవిడ్‌ పరీక్ష చేయించుకోవటం వీలు కాదు. ఒకసారి కరోనా టెస్ట్‌ చేయించుకుంటే మళ్లీ 14 రోజుల తరువాతే చేస్తారు. కాబట్టి నిజంగా కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తేనే.. టెస్ట్‌ చేయించుకోవాలి.

Updated Date - 2020-07-28T11:07:04+05:30 IST