ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ABN , First Publish Date - 2020-12-21T03:38:42+05:30 IST
జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి కరువుకు నెలవు. వర్షాకాలంలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటేవి.

12 ఏళ్ల తరువాత నిండిన ‘గండిపాళెం’
నిండుకుండను తలపిస్తున్న చెరువులు
మెట్టలో సాగు, తాగునీటికి భరోసా
ఉదయగిరి రూరల్, డిసెంబరు 20: జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి కరువుకు నెలవు. వర్షాకాలంలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటేవి. ఎటుచూసినా దుర్భిక్షం తాండవించేది. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నివర్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. భూమి నుంచి గంగమ్మ పైపైకి ఉబికివస్తోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్న మెట్ట ప్రాంత ప్రజలకు భరోసా కలిగింది. మెట్ట రైతుల ఆశలు చిగురింప చేయనున్నాయి.
నిండుకుండలా చెరువులు: ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో సుమారు 250 చెరువులు ఉన్నాయి. నివర్ తుఫాన్ కారణంగా ఆయా చెరువులకు నీరుచేరి నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. ఆయా చెరువుల కింద సుమారు 30 వేల ఎకరాల ఆయుకట్ట సాగులోకి రానుందని అధికారులు అంటున్నారు. ఆరేళ్ల తరువాత మెట్ట ప్రాంతంలో బీడు భూములు సాగులోకి రానున్నాయి.
పుష్కర కాలం తరువాత: మండలంలోని గండిపాళెం చెంచురామయ్య జలాశయం మెట్ట మండలాలైన వరికుంటపాడు, ఉదయగిరి మండలాలకు వరప్రసాదిని. పుష్కర కాలం తరువాత పూర్తిస్థాయి నీటిమట్టం 35 అడుగులకు చేరింది. జలాశయం ఎడమ కాలువ కింద 11 వేలు, కుడి కాలువ కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయానికి వరద ఇంకా వస్తుండడంతో ఈసారి చివరి ఆయకట్టు వరకు సాగునీరందే అవకాశముంది. రైతులు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రూ.100 కోట్లు రాబడి పొందవచ్చని అధికారులు అంటున్నారు. ఆయా మండలాల్లో 74 గ్రామాలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే సీతారామపురం మండలం మర్రివూట్ల, వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్లు అలుగులు పారుతుండడంతో రైతులు వరి, ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఆనందంగా ఉంది
పుష్కర కాలం తరువాత గండిపాళెం జలాశయం పూర్తి నీటి సామర్థ్యానికి నోచుకోవడం ఆనందంగా ఉంది. దీంతో 16 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. అధికారులు కాలువలకు మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు చేపట్టాలి.
- రెడ్డిబత్తిన నరసింహారావు, రైతు, గండిపాళెం
కాలువల మరమ్మతులు చేపడుతాం
మెట్ట ప్రాంతంలో చెరువులు, జలాశయాల్లో జలకళ సంతరించుకొంది. 12 ఏళ్ల తరువాత గండిపాళెం జలాశయం పూర్తి నీటి సామర్థ్యానికి నోచుకొంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాలువలకు మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తాం.
- రవి, ఇరిగేషన్ శాఖ డీఈ

