-
-
Home » Andhra Pradesh » Nellore » Water
-
భూగర్భజలం పైపైకి..
ABN , First Publish Date - 2020-12-07T04:01:51+05:30 IST
జిల్లాలో నివర్, బురేవి తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టం పెరిగింది.

9 మండలాల్లో గణనీయంగా పెరుగుదల
15 మండలాల్లో స్వల్పంగా..
3 మండలాల్లో మీటరన్నరకుపైగా తగ్గుదల
జిల్లా అంతటా 25.1 మి.మీ అత్యధిక వర్షపాతం
పెళ్లకూరులో వర్షాభావం
నెల్లూరురూరల్, డిసెంబరు 6 : జిల్లాలో నివర్, బురేవి తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. 9 మండలాల్లో గణనీయంగా పైకిరాగా, 15 మండలాల్లో స్వల్పంగా పెరిగాయి. కాగా మూడు మండ లాల్లో వర్షాభావం వల్ల మీటరన్నరకుపైగా తగ్గాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 25.1 మిల్లీ మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. అయినా పెళ్లకూరు మండలంలో ఇప్పటికీ 21.8 మి.మీ వర్షపాతం లోటుగా ఉంది.
పెన్నాకు భారీగా వరద
నివర్ తుఫాన్‌తోపాటు ఈశాన్య రుతుపవనాలు బలంగా కదలడంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బురేవి తుఫాన్‌తో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెన్నాకు భారీగా వరదనీరు వచ్చింది. దీనికితోడు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ చూసినా వర్షపు నీళ్లే కనిపిస్తుండడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. గతేడాదితో పోల్చితే పెద్దగా తేడా లేకపోయినా అత్యధిక మండలాల్లో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. 2019 డిసెంబరు 6వ తేదీకి 9.14 మీటర్ల వరకు జిల్లా భూగర్భ జలమట్టం నమోద వగా, తాజాగా 9.10 మీటర్లకు జలమట్టం నమోదైనట్లు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ఏపీఎస్‌డీపీఎస్ వెల్లడించింది.
3 మండలాల్లో తగ్గిన నీటిమట్టం
మూడు మండలాల్లో భూగర్భ జలమట్టం మీటరన్నరకు పైగా తగ్గింది. జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసినా ఆ మూడు మండలాల్లో సగటు వర్షపాతానికి కంటే తక్కువుగా వర్షపాతం నమోదుకావడవే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్లూరు, సంగం, ఏఎస్ పేట మండ లాల్లో గతేడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలమట్టంలో తగ్గుదల కనిపించింది. (తేడాలు టేబుల్‌లో చూపబడ్డాయి.)
25.1 మి.మీ అత్యధిక వర్షపాతం
జూన్ నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జిల్లాలో 918.6 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 1148.9 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో 25.1 మి,మీ వర్షపాతం అత్యధికంగా నమోదైంది. అక్టోబరులో 238.99 మి.మీలకు గాను 84.93 మి.మీ మాత్రమే నమోదైంది. నవంబరులో 313.40 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 487.97 మి.మీ కురిసింది. డిసెంబరులో ఆదివారం నాటికి 34.96 మి.మీ వర్షంపాతం నమోదు కావాల్సి ఉండగా, 88.15 మి.మీ నమోదైంది. జిల్లాలో 15 మండలాల్లో ఆశించిన మేర వర్షాలు కురవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి.
ఫ పెళ్లకూరులో వర్షాభావం
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా, పెళ్లకూరులో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఆదివారం వరకు సగటు వర్షపాతం 959.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 750 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 21.8 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా ఆందోళనకరంగానే నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే భూగర్భ జలమట్టం లోతుకెళ్లినట్లే లెక్కలు చెప్తున్నాయి.