పెట్రోల్‌ బంకులో కొలతల్లో మోసాలు

ABN , First Publish Date - 2020-12-08T03:09:32+05:30 IST

కొక్కుపాడు క్రాస్‌ రోడ్డు వద్ద వున్న ఇండియన్‌ పెట్రోల్‌ బంకులో కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారంటూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

పెట్రోల్‌ బంకులో కొలతల్లో మోసాలు
పెట్రోల్‌ బంకులో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

కోట, డిసెంబరు 7 :  కొక్కుపాడు క్రాస్‌ రోడ్డు వద్ద వున్న ఇండియన్‌ పెట్రోల్‌ బంకులో కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారంటూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నాగరాజు అనే కార్మికుడు లీటర్‌ బాటిల్‌లో ఒక లీటరు పెట్రోలు పోయించుకోగా, తక్కువగా రావడంతో పంప్‌బాయ్స్‌ను నిలదీశాడు.  మరో వ్యక్తి 100 రూపాయలకు పెట్రోల్‌ పోయమనగా, 35 రూపాయలకే పట్టి రీడింగ్‌ కరెక్ట్‌గా వుందంటూ పంప్‌బాయ్‌ చెప్పాడు. దీంతో ఈ ఇద్దరు వినియోగ దారులతోపాటు సీఐటీజూ నాయకులు రమణయ్య, హరినాథ్‌ ఆందోళన చేశారు. పెట్రోల్‌ బంకును సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో  విజిలెన్స్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కొండారెడ్డి, సీఐ వెంకటరానాయణు తనిఖీ చేశారు. పెట్రోల్‌ బంకులోని రికార్డులన, పంపులు, కొలతలను పరిశీలించారు. తమ తనిఖీల్లో తేడాలు కనిపించలేదని వారు తెలిపారు. కాగా, తన పెట్రోల్‌ బంకు ప్రారంభించి ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలు జరగలేదని, కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పెట్రోల్‌ బంకు యజమాని మద్దాలి సర్వోత్తమరెడ్డి తెలిపారు.  అవకతవకలు జరిగాయని రుజువు చేస్తే తానే దగ్గరుండి సీజ్‌ చేయిస్తామని వివరించారు. 

Updated Date - 2020-12-08T03:09:32+05:30 IST