కొనలేం.. తినలేం.!

ABN , First Publish Date - 2020-09-12T10:51:55+05:30 IST

బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే ధర.. ప్రశ్నిస్తే ఛీత్కారాలు.. మార్కెట్‌ ధరకన్నా అదనంగా విక్రయిస్తున్నా

కొనలేం.. తినలేం.!

చుక్కలనంటుతున్న కాయగూరలు

‘మార్కెట్‌’కన్నా అధిక ధరకు విక్రయాలు

చేతులెత్తేసిన అధికార యంత్రాంగం

శాఖల మధ్య సమన్వయలోపం

వ్యాపారులదే ఇష్టారాజ్యం


నెల్లూరు (వ్యవసాయం), సెప్టెంబరు 11 : బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే ధర.. ప్రశ్నిస్తే ఛీత్కారాలు.. మార్కెట్‌ ధరకన్నా అదనంగా విక్రయిస్తున్నా ఏ ఒక్క అధికారికి పట్టింపు లేదు. ఏ రోజుకారోజు ధర పట్టిక సిద్ధమవుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. వ్యాపారుల లాభోపేక్ష... అధికారుల అలసత్యం వెరసి వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. ఏ కాయగూర కొనాలన్నా అరవై రూపాయలకు పైమాటే. ఇక మెట్టప్రాంతమైన ఉదయగిరి ధరలు చూసి ప్రజల కళ్లు బయర్లు కమ్ముతున్నాయి.


కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. కరోనా సాకుతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. దీంతో నిత్యావసరమైన కూరగాయల కొనలేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కొవిడ్‌ కారణంగా మార్కెట్‌కు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు కూరగాయలు బయట దొరకడం లేదని బ్లాక్‌లో కొనుగోలు చేసి తీసుకొస్తున్నామంటూ దబాయిస్తున్నారు. మరీ ఇంత ధరనా అని ప్రశ్నిస్తే కొంటే కొనండి... లేదంటే వెళ్లిపోండంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దీంతో గత్యంతరం లేక కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ఒక్కో కాయగూరపై కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా అమ్మకాలు సాగిస్తున్నారు.


అధికారులు ఏం చేస్తున్నట్టు

బహిరంగ  మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇంకొంతమంది అధిక ధరలను ప్రశ్నిస్తున్నారు. వీరికి ఎవరూ మద్దతు పలకకపోవడంతో పరువు పోగొట్టుకోవడం ఎందుకని మిన్నకుండిపోతున్నారు. ధరలు భగ్గుమంటున్నా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఓ వైపు మార్కెటింగ్‌ శాఖ కూరగాయల ధరల కేటాయింపుతోపాటు ధరల పట్టిక ప్రదర్శిస్తున్నామని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో దుకాణాలు తనిఖీలు నిర్వహించాల్సిన పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖల అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దాడులు చేసి కేసులు నమోదు చేస్తే కొంతలో కొంతైనా ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారుల ధరల దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.  


అధికారులు నిర్ణయించిన ధర

కూరగాయలు నెల్లూరు

టమోట 50

మిర్చి 60

ఉర్లగడ్డలు 50

బీరకాయ 60

చేమగడ్డ 30

బీన్స్‌ 80 

చిక్కుళ్లు 60

గోరుచిక్కుళ్లు 50

క్యారెట్‌ 80

బీట్రూట్‌ 40

దోసకాయ 40

బెండకాయ 30

దొండకాయ 30

అల్లం 80

వంకాయలు 40

ఉల్లిపాయలు 30

క్యాబేజీ 30

మునగ కాయలు 80

కాకర కాయలు 60

Updated Date - 2020-09-12T10:51:55+05:30 IST