కోలుకుంటున్న వలస కూలీలు

ABN , First Publish Date - 2020-12-14T04:43:43+05:30 IST

కలువాయి మండలం వేరబొట్లపల్లి గ్రామానికి ఉపాధి కోసం వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైన వలస కూలీలు ప్రస్తుతం కోలుకుంటున్నారు.

కోలుకుంటున్న వలస కూలీలు
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వలస కూలీలను పరామర్శిస్తున్న మంత్రి మేకపాటి

మరో 39 మంది జీజీహెచ్‌కు తరలింపు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పరామర్శ 

కోలుకునే వరకు డిశ్చార్జి చేయవద్దని ఆదేశం

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 13 : కలువాయి మండలం వేరబొట్లపల్లి గ్రామానికి ఉపాధి కోసం వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైన వలస కూలీలు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శనివారం రాత్రి వరకు తొమ్మిది మందిని నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో 39 మందిని ముందు జాగ్రత్తగా శనివారం అర్ధరాత్రే గ్రామం నుంచి జీజీహెచ్‌కు తరలించారు. వారికి ఆదివారం అన్నిరకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. దీంతో జీజీహెచ్‌లో మొత్తం 48 మంది వలస కూలీలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉండటంతో వారికి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాగునీటి వల్ల కూలీలు అస్వస్థతకు గురికాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం విషతుల్యం కావటం వల్లే కూలీలు వాంతులు, విరోచనాలకు గురైనట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుటి కూలీల ఆరోగ్య పరిస్థితిని తెలుకుంటున్నారు. కాగా, జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలు వేరుబొట్లపల్లి గ్రామానికి వరినాట్లు వేసేందుకు వచ్చారన్నారు. అయితే వారిలో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురికావటంతో జీజీహెచ్‌కు తరలించారన్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు డిశ్చార్జి చేయవద్దని అధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు. మంత్రి వెంట జేసీ హరేందరా ప్రసాద్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ మస్తాన్‌బాషా, డాక్టర్‌ కనకాద్రి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-14T04:43:43+05:30 IST