చిక్కు వీడేనా.. గొలుసు తెగేనా!?
ABN , First Publish Date - 2020-04-26T10:25:11+05:30 IST
శుక్ర, శనివారాల్లో రికార్డు అయిన రెండు పాజిటివ్ కేసుల్లో ఒకరు వార్డు వలంటీరు కాగా, మరొకరు ..

తడలో వలంటీరుకు, ముత్తుకూరులో కిరాణా వ్యాపారికి పాజిటివ్
ఎవరెవరిని కలిశారో... ఎంతమందికి వైరస్ సోకిందో!
తల పట్టుకుంటున్న అధికార యంత్రాంగం
తడ, సూళ్లూరుపేటలలో వాలిపోయిన వైద్యబృందం
అందరికీ స్వాబ్ పరీక్షలు
ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు
స్టోన్‌హౌస్‌పేటలో డేంజర్‌బెల్స్
వెంకటగిరి, నాయుడుపేటలపై శ్రీకాళహస్తి ఎఫెక్ట్
రాకపోకలపై ఆంక్షలు
కలవరపెడుతున్న సామాజిక వ్యాప్తి భయం
ఇక తగ్గిందునుకున్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆరు రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రెండు రోజుల్లో నమోదైన రెండు పాజిటివ్ కేసులు అందరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. నిత్యం కిటకిటలాడే నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట కిరాణా మార్కెట్ కేంద్రంగా కరోనా వైరస్ సోకిందనే ప్రచారం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 60కిపైగా కరోనా పాజిటివ్ కేసుల నమోదైనా అవి ఏవి అధికారులను, ప్రజలను ఇంత కలవరపాటుకు గురిచేయలేదు. అవన్నీ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకే పరిమితం కావడంతో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే శుక్ర, శనివారాల్లో నమోదైన రెండు కేసులు ఇందుకు పూర్తిగా భిన్నమైనవి.
వీరికి ఎవరి ద్వారా వైరస్ సోకిందో అంతుపట్టడం లేదు. ఇది ఒక ప్రమాదకర అంశం కాగా, వీరిద్దరు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు కావడంతో వీరి ద్వారా ఇంకెంత మందికి వైరస్ సోకిందో అంచనా వేయలేకపోవడం మరో ప్రమాదరక అంశం. ఈ రెండు కేసులను పరిశీలిస్తే పొరుగు జిల్లాల తరహాలో నెల్లూరు జిల్లా కూడా సామాజికవ్యాప్తిలోకి అడుగుపెట్టిందా..!? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నెల్లూరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : శుక్ర, శనివారాల్లో రికార్డు అయిన రెండు పాజిటివ్ కేసుల్లో ఒకరు వార్డు వలంటీరు కాగా, మరొకరు కిరాణా వ్యాపారి. తడ మండలానికి చెందిన ఒక మహిళా వలింటీరు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. అన్నకు మూత్రపిండాల జబ్బు రావడంతో కొద్ది రోజులపాటు ఆయనతోనే ఆ ఆసుపత్రిలో బస చేసింది. ఈ నెల 14న ఆయన మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆమె అదే రోజు అన్న సొంత గ్రామమైన సూళ్లూరుపేట పరిధిలోని ఒక గ్రామానికి వెళ్లింది. నాలుగైదు రోజులు అక్కడే బస చేసింది. ఆ తరువాత తడ మండలానికి తిరిగి వచ్చి వలంటీరు విధుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ఆమెకు జర్వం, జలుబు లక్షణాలు కనిపించడంతో స్వాబ్ తీసి పరీక్షలకు పంపారు. శనివారం ఉదయం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.
ఈ మధ్య కాలంలో ఆమె వలంటీరుగా తన గ్రామమంతా తిరిగారు. ఎమ్మెల్యే నేతృత్వంలో మూడు రోజుల క్రితం పంపిణీ చేసిన సరుకుల పాకెట్లను తన పంచాయతీ పరిధిలోని 30 మంది వలంటీర్లతో కలిసి ప్యాక్ చేశారు. ఆ తరువాత వాటిని తన పరిఽధిలోని 50 ఇళ్లకు చేరవేశారు. ఇవన్నీ జరిగిన మరుసటి రోజే ఈమెకు పాజిటివ్ రిపోర్టు రావడంతో అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు. శనివారం ఉదయం నుంచే ఆ పంచాయతీ పరిధిలోని ఇతర వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆమె సరుకులు పంపిణీ చేసిన 50 గృహాలకు చెందిన వారు, ఆమెకు సన్నిహితంగా మెలిగేవారిని పిలిపించి స్వాబ్‌లు తీశారు. సూళ్లూరుపేట పరిధిలోని ఈమె అన్న స్వగ్రామంలో కూడా స్వాబ్‌లు కలెక్ట్ చేశారు. వలంటీర్ అన్న కుటుంబానికి చెందిన మొత్తం 9 మంది నుంచి స్వాబ్‌లు సేకరించారు. ఆ అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈమె ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఈ రెండు గ్రామాలకు చెందిన అందరినీ హౌస్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.
కిరాణా కొట్టు వ్యాపారి
శుక్రవారం రాత్రి వెలుగుచూసిన మరో కేసుకు సంబంధించిన వ్యక్తి ఒక కిరాణా కొట్టు వ్యాపారి. ముత్తుకూరు మండలంలోని ఓ గ్రామంలో ఈయన కిరాణా కొట్టు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల క్రితం ఈయన జలుబు, జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. స్వాబ్ సేకరించి టెస్టింగ్‌కు పంపగా పాజిటివ్‌గా తేలింది. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈయనతోపాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నెల్లూరు క్వారంటైన్‌కు తరలించారు. ఈయన కిరాణాకొట్టు నిర్వహిస్తుండటంతో ఇతని ద్వారా ఆ గ్రామంలో ఇంకెంత మందికి వైరస్ సోకిందోననే ఆందోళనలు ఆ గ్రామంలో వ్యక్తం అవుతున్నాయి. ఇతని దుకాణానికి వచ్చే వారిని, సన్నిహితులు.. మొత్తం 80కిపైగా గుర్తించి రక్తపరీక్షల ద్వారా వైరస్ లక్షణాలను చెక్ చేశారు. గ్రామంలోని ఎవరూ ఇల్లు వదలి బయటకు రావొద్దని ఆదేశించారు.
స్టోన్‌హౌస్ పేటలో డేజంర్ బెల్
జిల్లా వ్యాపారానికి కీలక స్థావరం నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట. ఇలాంటి ప్రదేశంలో కరోనా బెల్ మోగుతోంది. ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముత్తుకూరు మండలానికి చెందిన వ్యాపారి ప్రతిరోజు వేకువజామున స్టోన్‌హౌస్‌పేటకు వచ్చి తన దుకాణానికి కావాల్సిన సరుకులు టోకుగా కొనుగోలు చేసుకొని వెళతాడు. ఈ క్రమంలోనే తనకు వైరస్ సోకి ఉంటుందని అతను అన్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ఒక వ్యాపారిని, అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటి ఆధారంగా గమనిస్తే నిత్యం వేలాది మంది క్రయ, విక్రయాలు జరిపే స్టోన్‌హౌస్‌పేటలో కరోనా వైరస్ మూలాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఊహే అటు అధికారులను, ఇటు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో స్టోన్‌హౌస్‌పేట మీద పోలీసులు నిఘా పెంచారు.
వెంకటగిరికి శ్రీకాళహస్తి షాక్
ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రభావం కూడా వెంకటగిరి, నాయుడుపేట ప్రాంతాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రెండు శ్రీకాళహస్తికి సమీపంలో ఉండగా, అక్కడివాసులతో ఇక్కడి వారికి బంధుత్వాలు ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తించేవారు పలువురు వెంకటగిరిలో కాపురం ఉంటున్నారు. ఈ రెండు ప్రాంతాలు శ్రీకాళహస్తితో దాదాపుగా కలిసిపోయినట్లే ఉంటాయి.
శ్రీకాళహస్తిలో కరోనా సామాజిక వ్యాప్తికి చేరుకోవడంతో ఎవరికి పరిస్థితి ఎలా ఉందో చెప్పలేని స్థితి. ఈ సమయంలో ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి రాకపోకలు సాగిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వెంకటగిరి, నాయుడుపేట ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి, నాయుడుపేట మధ్య రాకపోకలు సాగించే అన్ని గ్రామీణ రహదారులను మూసివేశారు.
సామాజిక వ్యాప్తి కలవరం
మార్చి 30 నుంచి నెల్లూరులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చినా అటు అధికారులు, ఇటు ప్రజలు పెద్దగా ఆందోళన చెందలేదు. ఈ కేసులన్నీ మర్కజ్‌కు లింకు ఉన్నవి కావడం, అక్కడికి వెళ్లివచ్చిన వారి కుటుంబ సభ్యులకే వైరస్ సోకడంతో పెద్దగా కలవరపాటుకు గురికాలేదు. ఎవరికి వైరస్ సోకే ప్రమాదం ఉందో ముందే ఊహించి వ్యాధి లక్షణాలు బయటపడకముందే వారిని క్వారంటైన్లకు తరలించడంతో వైరస్ వ్యాప్తి కాంటాక్ట్స్ వరకే ఆగిపోయింది. అయితే ఇప్పుడు వార్డు వలంటీర్, కిరాణా వ్యాపారులకు వైరస్ ఎవరి నుంచి సోకిందో తెలియడం లేదు. వీరిద్దరు మర్కజ్‌కు, విదేశాలకు వెళ్లలేదు. అక్కడికి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలూ లేవు. అయినా వీరికి వైరస్ సోకింది అంటే జిల్లాలో కూడా సామాజిక వ్యాప్తికి బీజం పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వీరిద్దరికి ప్రజలతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీరి నుంచి ఎంత మందికి వైరస్ సోకిందో అంచనా వేసే అవకాశాలు తక్కువ. అయినా అధికారులు వీరి కాంటాక్ట్‌ను గుర్తించడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరి ద్వారా వైరస్ సోకిన వారిని ఇప్పుడే గుర్తించడం కష్టం. కనీసం 10 నుంచి 14 రోజులు గడిస్తే కాని వ్యాధి లక్షణాలు బయటపడవు. అంతవరకు వలంటీర్, కిరాణా వ్యాపారులకు సంబంఽధించిన గ్రామాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గం. ఈ గ్రామల ప్రజలు మరో 15 రోజులపాటు పూర్తిగా ఇళ్లకు పరిమితం అయితేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం వీలవుతుంది.