సొంతూర్లకు వలస పక్షులు

ABN , First Publish Date - 2020-04-07T10:49:56+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం నిలిచిపోయింది.

సొంతూర్లకు వలస పక్షులు

రోడ్డు మార్గాన వెళ్లేందుకు అడ్డంకులు

పట్టాల వెంబడి నడక 

రైల్వే లైన్‌పై పోలీసుల నిఘా 

బందోబస్తు ఏర్పాటు

సామాజిక దూరం పాటించని ప్రయాణికులు

గుర్తించి సహాయక కేంద్రాలకు తరలింపు


నెల్లూరు,(క్రైం) ఏప్రిల్‌ 6 : కరోనా  నియంత్రణలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఎక్కడా రైళ్లు, బస్సులు  నడవడంలేదు.  దీంతో పనులన్ని నిలిచిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజలు తమ సొంతూర్లకు చేరుకునేందుకు  విశ్వప్రయత్నం చేస్తున్నారు. అవేమీ ఫలించక పోవడంతో చివరికి కాలినడకన సొంతూర్లకు వెళ్లేందుకు రోడ్డు మార్గం గుండా ప్రయత్నిస్తున్నా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన ప్రజలు రైలు పట్టాల వెంబడి తమ సొంత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలోమీటర్లు మేర రైలు పట్టాల వెంబడి రోజుల తరబడి నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఈ ప్రయత్నానికి కూడా రైల్వే పోలీసులు అడ్డుకట్ట వేశారు. 


పికెట్స్‌ ఏర్పాటు 

నిబంధనలను అతిక్రమించి రైలు పట్టాలపై సామాజిక దూరం పాటించకుండా నడిచి వెళుతున్న ప్రజలను కట్టడి చేసేందుకు రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు  చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జీ వసంతకుమార్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ జీ మంగారావు పర్యవేక్షణలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల వద్ద ప్రత్యేక పికెట్స్‌ ఏర్పాటు చేసి రైలు పట్టాలపైకి ప్రజలను రానివ్వకుండా హెచ్చరికలు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాక్‌మన్‌, స్టేషన్‌ సూపరింటెం డెంట్‌లు రైలు పట్టాలపై ప్రజలు నడుచుకుంటూ వెళుతుంటే పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.


దీంతో పోలీసులు పట్టాలపై నడిచి వెళుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షణ సహాయ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ వారికి ఆహార సదుపాయంతో పాటు  కావాల్సిన మాస్క్‌లు, శానిటైజర్లు అందజేసి దగ్గర్లోని హోమ్‌లకు తరలిస్తున్నారు. రైలు పట్టాలపై వెళుతున్న వారి వివరాలను ప్రజలు 96182 32115 నంబరుకు తెలియజే యాలని  రైల్వే పోలీసులు తెలిపారు.Read more