నగరం నిండా సవాళ్లే!

ABN , First Publish Date - 2020-09-14T10:21:56+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న ఐఏఎస్‌ అధికారి కోతమాసు దినేష్‌ ..

నగరం నిండా సవాళ్లే!

 పూర్తిగా గాడితప్పిన పాలన 

సిటీప్లానింగ్‌పై ఏసీబీ ఉచ్చు

అవినీతి కూపంగా రెవెన్యూ 

ఉద్యోగులకు నెలల తరబడి అందని జీతాలు 

నేడు కొత్త కమిషనర్‌ దినేష్‌ బాధ్యతల స్వీకరణ


నెల్లూరు (సిటీ), సెప్టెంబరు 13 : నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న ఐఏఎస్‌ అధికారి కోతమాసు దినేష్‌ కుమార్‌కు కార్పొరేషన్‌లోని సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పూర్తిగా గాడితప్పిన నగర పాలనను చక్కదిద్దడం పెద్ద సవాలే అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.  


నెల్లూరు కార్పొరేషన్‌లో కొన్ని నెలలుగా ఇన్‌చార్జుల పాలన సాగుతోంది. కమిషనర్‌ సహా పలు ముఖ్య విభాగాధిపతులు ఇన్‌చార్జులే కావడం గమనార్హం. రెగ్యులర్‌ అధికారులు లేకపోవడం, ఇన్‌చార్జులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోవడం, కీలక నిర్ణయాలు తీసుకోలేకపో వడం వంటి కారణాలతో పాలన గాడి తప్పింది. ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సిటీప్లానింగ్‌ విభాగాన్ని ఏసీబీ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే డీసీపీ, ఏసీపీ, టీపీఎస్‌, టీపీవోగా పనిచేసిన వారు అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వానికి ఏసీబీ నివేదించింది. ఇక రెవెన్యూ విభాగంలో అయితే చేయి తడపనిదే పని జరగని పరిస్థితి నెలకొంది. బిల్‌ కలెక్టర్ల నుంచి ఆర్‌ఐలు, ఆర్వోలు, ఆపై వారు పన్నుల విధింపులో చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు కలెక్షన్‌ కింగ్‌లుగా మారి ప్రతి పనిలో పర్సెంటేజీలు దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి.


హోటళ్ల నుంచి లక్షల్లో లంచాలు తీసుకుని నీటి పన్నులను వేలల్లో వేశారన్న ఆరోపణ ప్రస్తుతం ఆ విభాగాన్ని కుదిపేస్తోంది. అంతేకాదు, వాస్తవంగా లేని ఉద్యోగుల పేరిట జీతాలు విడుదలవుతున్న ఉదంతం కార్పొరేషన్‌లో అవినీతికి నిదర్శనంగా మారింది. నగర పాలనలో అతి ముఖ్యమైన పారిశుధ్య విభాగంలో అయితే అవినీతి అంతా ఇంతా కాదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో దోచుకున్నవారికి దోచుకున్నంత సొమ్ము అన్నట్టు ఆ విభాగం పనితీరు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. బ్లీచింగ్‌, ఇతర పారిశుధ్య సామగ్రి కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. 


ఉద్యోగులకు అందని జీతాలు

కార్పొరేషన్‌లోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదు. సుమారు 70 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లకు గడిచిన ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. చెత్త తరలించే వాహన డ్రైవర్లకు మూడు మాసాలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బిల్‌ కలెక్టర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లకు కూడా జీతాలు సక్రమంగా చెల్లించలేని దుస్థితి నగర పాలికలో నెలకొంది. కొత్త కమిషనర్‌ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి, పాలనను గాడిలో పెట్టడంతోపాటు నెల్లూరును సుందర సింహపురిగా మార్చాలని నగర ప్రజలు ఆశిస్తున్నారు. 

Updated Date - 2020-09-14T10:21:56+05:30 IST