పవిత్రం..ఆరోగ్యకరం!

ABN , First Publish Date - 2020-04-24T10:50:28+05:30 IST

ముస్లింలకు అతి ముఖ్యమైనది, పవిత్రమైనది రంజాన్‌ మాసం.

పవిత్రం..ఆరోగ్యకరం!

నేటి నుంచి రంజాన్‌ నెల

ఉపవాస దీక్షలు ప్రారంభం


నెల్లూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 23 : ముస్లింలకు అతి ముఖ్యమైనది, పవిత్రమైనది రంజాన్‌ మాసం. వారు ఈ 30 రోజులు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష చేపడతారు. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ఈ ఏడాది ముస్లింలు ఇళ్లలోనే ఉండి రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తోంది. ఉపవాస దీక్ష(రోజా)ను ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పాటిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్‌ అని, సూర్యాస్తమయం అనంతరం ఇఫ్తార్‌ అనే పేర్లతో ఆహారాన్ని స్వీకరిస్తారు. ప్రతీరోజు ఖురాన్‌లోని 1/30 భాగాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణ చేస్తారు. ఇలా 30 రోజుల్లో ఖురాన్‌ పఠనం పూర్తి చేస్తారు. అయితే పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ దీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.


ఈ ఉపవాసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, నెలంతా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలు ఉత్తేజితమవుతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఈ ఉపవాసాలు నీతి నిజాయితీ, స్వీయ క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేయడంతోపాటు పాపకార్యాలను దూరం చేస్తాయి. రంజాన్‌ మాసంలో దాతృత్వం ప్రత్యేకమైనది. ఈ నెలలో ముస్లింలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని వారి చుట్టూ ఉన్న తక్కువ అదృష్టవంతులకు కచ్చితంగా పంచాలి. 


లాక్‌డౌన్‌లో దీక్షలకు సూచనలు

లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు మసీదులు మూసివేసినందున ఇంటిలోనే ప్రార్థనలు చేసువాలి.

కరోనా ముప్పు నేపథ్యంలో ఎక్కువ మందితో సామూహికంగా ఇఫ్తార్‌ విందులు నిర్వహించడం శ్రేయస్కరం కాదు. 

ఇంటిలోనే జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో విందు చేసుకోవడం ఉత్తమం

ఇఫ్తార్‌ విందుల కోసం నగదు వినియోగించేవారు ఆ మొత్తంతో అవసరార్థులకు ఆహారాన్ని అందిస్తే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Updated Date - 2020-04-24T10:50:28+05:30 IST