ప్రాణాలు పోతున్నా ప్రజారక్షణే ధ్యేయంగా..

ABN , First Publish Date - 2020-10-21T05:33:19+05:30 IST

మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దుల్లోని భారత భూబాగాలైన లడక్‌, సియాచిన్‌ ప్రాంతాలు కీలకం. భద్రతాదళం, ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడకముందు సరిహద్దులను రక్షించే మహత్తర

ప్రాణాలు పోతున్నా ప్రజారక్షణే ధ్యేయంగా..

పోలీస్‌ అమరుల త్యాగం చిరస్మరణీయం

కొవిడ్‌ నియంత్రణలో ప్రధాన భూమిక

ప్రాణాలు ఎదురొడ్డి సేవలు

నేడు అమరవీరుల సంస్మరణ దినం 


సమాజాన్ని మేము కాపాడాలి.. మమ్మల్ని ఎవరు కాపాడతారన్న కోపం, విసుగు, ఆవేదన వారిలో ఉండవు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు.. అవిశ్రాంత పనుల కారణంగా కనీసం ప్రశాంతంగా కడుపునిండా తినలేని దైన్యస్థితి వారిది. ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్న పోలీసుల సేవలకు విలువ కట్టలేం విధి నిర్వహణలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నా, బెదిరింపులు ఎన్ని వస్తున్నా, ప్రాణాలు కోల్పోతామని తెలిసినా ప్రజల సంరక్షణ, రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహి ంచే రక్షకభటుల గురించి ఎంత చెప్పుకున్నా చాలదు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో పోలీసుల పనితీరు వర్ణణాతీతం.


కొవిడ్‌ సమయంలో విధులు నిర్వహిస్తూ ఇద్దరు పోలీసులు వీరమరణం పొందగా 701 మంది కొవిడ్‌  బారినపడ్డారు. ఇక విధులు నిర్వహిస్తూ మరో ఏడుగురు మృతి చెందారు. వీరందరినీ స్మరిస్తూ బుధవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


నెల్లూరు (క్రైం), అక్టోబరు 20 : మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దుల్లోని భారత భూబాగాలైన లడక్‌, సియాచిన్‌ ప్రాంతాలు కీలకం. భద్రతాదళం, ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడకముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్రం రిజర్వు పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్‌) నిర్వహించేది. 1959, అక్టోబరు 21న డీఎస్పీ కరమ్‌సింగ్‌ నేతృత్వంలో 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్‌ భూబాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్‌పీఎఫ్‌ దళం హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతంలో ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసు వీరుల రక్తంతో తడిచిన హాట్‌స్ర్పింగ్స్‌ నెత్తుటిబుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ర్టాల పోలీసులతో కూడిన బృందం ఈ స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీ.


జిల్లాలో పరిస్థితులు ఇవి...

జిల్లాలో మొత్తం 66 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఎస్‌ఐ స్థాయి అధికారి వరకు సరిపడా సిబ్బంది ఉన్నా కిందిస్థాయిలో మాత్రం జనాభాకు తగ్గట్టు సిబ్బంది లేరు. నిరంతరాయంగా విధులు నిర్వహించాల్సి ఉంటోంది. మరోవైపు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సిబ్బంది సతమతమవుతున్నారు. క్రమశిక్షణ కలిగిన విభాగం కావడంతో తమకు జరిగే అన్యాయాలు, ఇబ్బందులను బహిరంగంగా మాట్లాడలేక సర్దుకుపోవాల్సి వస్తోంది. నిత్యం విధినిర్వహణలో వీరు జీవితాలను త్యాగం చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురువడంతోపాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇదిలావుంటే కొంతమంది అక్రమార్కుల వల్ల ఖాకీల జీవితంలో రెండో కోణం చూసే అవకాశం లేకుండాపోతోంది.


సమాజాన్ని కాపాడాల్సిన శాఖలోనే లంచాల జాడ్యం పోలీసు ప్రతిష్టను దెబ్బతీస్తోంది. నిజాయితీగా విధులు నిర్వహించే వారికి విలువలేకుండా పోతోంది. అక్రమాలపై ఉక్కుపాదం మోపి, శాంతిభద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులు ఎందరో ఉన్నారు.  గత అక్టోబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు వివిధ కారణాలతో విధుల్లో ఉన్న తొమ్మిది మంది మృతి చెందారు.  పి. ప్రబాకర్‌, బి మోహన్‌బాబు, ఎన్‌ రామ్మోహన్‌ సింగ్‌, ఎస్‌పీ వెంకటేశ్వర్లు, ఐ సుధాకర్‌, ఎంపీ నరసారెడ్డి, ఎపి చలపతి, టి బాస్కర్‌ రెడ్డి, ఎం రమేష్‌ మృతి చెందిన వారిలో ఉన్నారు.


నేడు వేడుకలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా  బుధవారం ఉదయం పోలీసు కవాతు మైదానంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఆధ్వర్యంలో పోలీసు కవాతుతోపాటు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా సిబ్బంది పలువురు పాల్గొననున్నారు. 


సమాజం కోసం రోజూ యుద్ధం

దేశం కోసం, సమాజం కోసం ప్రతి రోజు 24 గంటలు పోలీసులు ఓ యుద్ధం చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది మృత్యుఒడికి చేరుతున్నారు. అలాంటి వారందరికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. 

- భాస్కర్‌భూషణ్‌ , ఎస్పీ

Updated Date - 2020-10-21T05:33:19+05:30 IST