నేడు తిక్కన సోమయాజి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2020-02-22T06:27:40+05:30 IST

మహా భారతంలోని 13 పర్వాలను ఆంధ్రీకరించిన జిల్లా వాసి మహాకవి తిక్కన సోమయాజి

నేడు తిక్కన సోమయాజి విగ్రహావిష్కరణ

నెల్లూరు (సాంస్కృతికం), ఫిబ్రవరి 21 : మహా భారతంలోని 13 పర్వాలను ఆంధ్రీకరించిన జిల్లా వాసి మహాకవి తిక్కన సోమయాజి విగ్రహావిష్కరణ శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని విగ్రహ ప్రదాతలు భయ్యా వాసు, భయ్యా రవి తెలిపారు. వారు మాట్లాడుతూ నెల్లూరును పాలించిన మనుమసిద్ధి రాజుకు మంత్రిగా వ్యవహరించిన కవీంద్రుడు తిక్కన సోమయాజి విగ్రహం నెల్లూరులో లేకపోవడం కొరతగా ఉందన్నారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయం సమీపాన పెన్నానది ఒడ్డున తిక్కన మహా భారతాన్ని ఆంధ్రీకరించాడని, అందుకు గుర్తుగా క్షేత్రపాలకుడైన రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో తిక్కన మండపం నిర్మించారన్నారు. శిథిలమైన ఆ మండపాన్ని. రెండేళ్ల కిందట నాటి రంగనాథస్వామి ఆలయ చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు ఆధునీకరించి తిక్కన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారన్నారు. 


తండ్రి భయ్యా వెంకటరమణయ్య, శుభమస్తు మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ బాధ్యతను తాము స్వీకిరించామన్నారు. వీఆర్‌ కనస్ట్రక్షన్‌ శ్రీనివాసరావు సలహా మేరకు తిక్కన మండపాన్ని జీర్ణోద్ధరణకావించామన్నారు. రాజమండ్రికి చెందిన శిల్పి రాజకుమార్‌ వడయార్‌తో తిక్కన విగ్రహాన్ని తయారు చేయించామని, అనివార్య కారణాలతో ఆవిష్కరణ ఆలస్యమైందన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు భరత్‌కుమార్‌యాదవ్‌ నగర ప్రముఖుల సమక్షంలో తిక్కన విగ్రహాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలుగు భాషాభిమానులు, తిక్కన అభిమానులు రంగనాథస్వామి భక్తులు తరలిరావాలని వారు కోరారు. 

Updated Date - 2020-02-22T06:27:40+05:30 IST