-
-
Home » Andhra Pradesh » Nellore » this week is very important
-
ఈ వారమే కీలకం !
ABN , First Publish Date - 2020-04-07T19:05:36+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణకు సమష్టి కృషి అవసరం. ఎవరైనా..

14తో ముగియనున్న లాక్‌డౌన్
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
ప్రజలంతా ఇళ్లలోనే ఉంటేనే సేఫ్
లేకుంటే నిబంధనలు పొడిగించే అవకాశం
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నివారణకు సమష్టి కృషి అవసరం. ఎవరైనా నాకేమవుతుం దిలే.. అని అనుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. లాక్‌డౌన్‌లో రాబోవు వారం చాలా కీలకంగా మారనుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్వీయ నిబంధన కచ్చితంగా పాలించాల్సిందే.
పెరుగుతున్న కేసులు
ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్నది. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడగించే అవకాశమూ లేకపోలేదు. ఓ వ్యక్తి కరోనా బారిన పడితే, గరిష్ఠంగా 14 రోజుల్లోపు వైరస్ లక్షణాలు బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లెక్కన మార్చి 22 నుంచి విదేశీయుల రాక ఆగింది. అంటే అప్పటి నుంచి 14 రోజులు అనుకుంటే ఈ నెల మొదటి వారంలోపు కరోనా సోకిన వ్యక్తులు ఎవరన్నది తెలుస్తుంది. ఈ మధ్యలో లాక్‌డౌన్ ఉంది కాబట్టి వారు బయట తిరిగేందుకు అవకాశముండదు. అందులోనూ వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉంచారు కాబట్టి కమ్యూనిటీ వ్యాప్తి ఉండదని కేంద్రం భావించింది.
ఆ ప్రకారమే లాక్‌డౌన్ ప్రకటించగా, వారం పాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్‌గా తేలుతున్నది. దీన్ని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో పాటు వారు కాంటాక్ట్ అయిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న వారం చాలా కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అప్రమత్తత ఎంతో అవసరం
ఈ వారం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, మరీ అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసినా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి జీజీహెచ్‌లో ఐసోలేషన్ చేస్తుండగా అనుమానం ఉన్న వ్యక్తులను క్వారైంటైన్ వార్డుల్లో ఉంచారు. రానున్న వారంలో గరిష్ఠంగా కేసులు బయటపడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తే మరొకరికి వైరస్ సోకకుండా నివారించవచ్చని వారు చెబుతున్నారు.
ఆకతాయిల ఆట కట్టించాలి..
కొందరు ఆకతాయిలు నిర్లక్ష్యంగా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఉదయం పది గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తుండడంతో ఆ పేరు చెప్పుకొని రోడ్లపైకి వస్తున్నారు. అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నా కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించడంలేదు. కీలకమైన ఈ వారంలో ప్రజలు సహకరించకపోతే లాక్‌డౌన్ పొడిగించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ సమయంలో ప్రజలంతా స్వీయ నిర్బంధానికి పరిమితమైతే వారితో పాటు వారి కుటుంబం, సమాజం కరోనా వైరస్ నుంచి బయటపడుతుందనడంలో సందేహం లేదని నిపుణులు అంటున్నారు.