వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు

ABN , First Publish Date - 2020-03-12T09:54:22+05:30 IST

వైసీపీ నేతలు నామినేషన్ల చివరిరోజు జిల్లాలో చేసిన బీభత్సం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి

వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు

నామినేషన్లు చించేసి అడ్డుకోవడం దారుణం

ఇవన్నీ ప్రభుత్వ దౌర్జన్యాలే..

మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు(వ్యవసాయం), మార్చి 11 : వైసీపీ నేతలు నామినేషన్ల చివరిరోజు జిల్లాలో చేసిన బీభత్సం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీపడే ధైర్యం లేక అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చింపేసి అడ్డుకోవడం దారుణమన్నారు.


పెళ్లకూరు మండల కార్యాలయంలో వైసీపీ నేత రౌడీలతో తిష్టవేసి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాడన్నారు. పెళ్లకూరు జడ్పిటీసీ అభ్యర్థి నెల్లూరులోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరితే బలవంతంగా తీసుకెళ్లిపోయారన్నారు. ఆ మండలం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు లేకుండా చేశారని ఆరోపించారు.


అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెళ్ళిన పరసారత్నంపై దాడికి యత్నించి ఆయన కారును ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో దళిత మహిళ నామినేషన్‌ వేయడానికి బయలుదేరితే కత్తులతో నరుకుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు అధికారులు పూర్తి సహకారం అందించడం దురదృష్టకరమన్నారు.


మాజీ ప్రజాప్రతినిధులు, దళితులపై దాడులు జరుగుతుంటే జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొదలకూరులో వార్డు వలంటీరుగా, మద్యం దుకాణం సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మద్యం సీసాలతో దొరికిపోయాడని ఇవన్నీ వైసీపీ దౌర్జన్యాలు కాదని ప్రభుత్వ దౌర్జన్యాలేనని ఆయన తూర్పారబట్టారు.


దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్‌ కమిషన్‌ వెంటనే స్పందించాలన్నారు. పెళ్లకూరు మండలానికి సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు గడువు పెంచి ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

Updated Date - 2020-03-12T09:54:22+05:30 IST