కొరవడిన ముందు చూపు..

ABN , First Publish Date - 2020-04-07T10:52:10+05:30 IST

నిపుణుల కమిటీ ఆదేశాలు పట్టించుకోకుండా చేపట్టాల్సిన పనులు అనుకూల సమయంలో చేపట్టక పోవడంతో నేడు

కొరవడిన ముందు చూపు..

కండలేరు వరద కాలువ నుంచి లీకేజీ

వృథా అవుతున్న సోమశిల జలాలు

పట్టించుకోని అధికారులు


అనంతసాగరం, ఏప్రిల్‌ 6: నిపుణుల కమిటీ ఆదేశాలు పట్టించుకోకుండా చేపట్టాల్సిన పనులు అనుకూల సమయంలో చేపట్టక పోవడంతో నేడు విలువైన సోమశిల జలాలు వృథా అవుతున్నాయి. ఏటా సమస్య ఉన్నా పరిష్కరించడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి ఈ లీకేజీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సోమశిల జలాశయానికి ఈ ఏడాది పుష్కలంగా నీరు సమకూరింది. పూర్తి సామర్థ్యాన్ని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో మొదటి పంట కింద డెల్టా, నాన్‌డెల్టా కింద సుమారు ఆరు లక్షల ఎకరాలు పంట పండింది. మొదటి పంటకు సోమశిల నుంచి ఇస్తున్న నీటి సరఫరా మార్చి 31కి నిలుపుదల చేయడం జరిగింది.


ప్రస్తుతం పంటకు సంబంధించిన నీటి అవసరాలు లేవని భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీటిని జలాశయంలో వృథా కాకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే జలాశయం కండలేరు వరద కాలువ నుంచి రోజు వారీగా సుమారు 400 క్యూస్కెక్కులు కాలువ గుండా ప్రవహిస్తుంది. ఈ లీకేజీని అరికట్టేలా అధికారులు చేసే ప్రయత్నాలు కనింపించడం లేదు. నీటి అవసరం లేకున్నా లీకేజీ కారణంగా నీరు కాలువ గుండా ప్రవహించడం రైతులను బాధిస్తుంది. ఈ కాలువ గేటు మొరాయించడంతో  సోమశిల జలాలు వృథా అవుతున్నాయి. లీకేజీలను అరికట్టే చర్యలు మాత్రం కనిపించడం లేదు. జలాశయానికి ఉన్నత అధికారులు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కండలేరు వరద కాలువ గేట్లు ఆధునికీకరించేలా సూచనలిస్తున్నా ఆ దిశగా పనులు చేసిన దాఖలాలు లేవు.  

Updated Date - 2020-04-07T10:52:10+05:30 IST