కోయంబేడు కల్లోలం

ABN , First Publish Date - 2020-05-10T07:27:42+05:30 IST

చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మార్కెట్‌కు చెందిన కూలీలలో 50 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు.

కోయంబేడు కల్లోలం

కరోనా కేసులతో జిల్లాలో ఆందోళన

ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయల దిగుమతి

వైరస్‌ వ్యాప్తితో ఆగిన రవాణా

నెల్లూరు, గూడూరు, నాయుడుపేటలపై ప్రభావం

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

వ్యాపారులు, కూలీల నుంచి స్వాబ్‌ల సేకరణ


నెల్లూరు(వైద్యం) మే 9 : చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మార్కెట్‌కు చెందిన కూలీలలో 50 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే, అక్కడి లింకులు జిల్లాలోనూ ఉంటాయేమోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. సాధారణంగా కోయంబేడు నుంచి జిల్లాకు అవసరమైన కూరగాయలు చేరవేస్తుంటారు. ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలు దిగుమతి అవుతుండగా, ఒక్క నెల్లూరు నగరానికే 5 టన్నుల వరకు వస్తుంటాయి. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మార్కెట్‌కు మిగిలిన మొత్తం కూరగాయల సరఫరా అవుతోంది. ఇక సరిహద్దు మండలమైన తడకు కూడా ఈ మార్కెట్‌ నుంచి కూరగాయల సరఫరా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కోయంబేడులో కూలీలు కరోనాకు గురికావడంతో జిల్లాలోని కూరగాయల మార్కెట్‌ నిర్వాహకులు, కొనుగోలుదారులలో ఆందోళన రేగుతోంది.


కూరగాయలు సరఫరా చేసే వాహన డ్రైవర్లు, క్లినర్లు కరోనా వైరస్‌ ప్రభావానికి గురయితే దీని ప్రభావం ఆయా మార్కెట్లలో పనిచేసే కూలీలపై పడే అవకాశం ఉంటుంది. వచ్చిన సరకును ప్రతి రోజూ ఉదయం 5 నుంచి 8 గంటల వరకు జిల్లాలోని మార్కెట్లలో పని చేస్తున్న కూలీలే ముందుగా అన్‌లోడ్‌ చేస్తారు. డ్రైవర్‌, క్లినర్‌లు కూడా ఈ అన్‌టోడ్‌లను పర్యవేక్షించే అవకాశం ఉండటంతో కూలీలతోపాటు కూరగాయల షాపుల నిర్వాహకులకు కరోనా భయం పట్టుకుంది. నెల్లూరులోనే 50 మంది కూలీలు మార్కెట్‌లో పని చేస్తుండగా గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలలో మరో 100 మంది దాకా ఉన్నారు.   


నిర్ధారణ పరీక్షలు 

ఇదిలా ఉంటే కోయంబేడు ప్రభావంతో రెండు రోజులు ఆలస్యంగా మేలుకున్న మార్కెట్‌ నిర్వాహకులు కోయంబేడు నుంచి కూరగాయల రవాణాను స్తంభింప చేశారు. నాలుగు రోజుల క్రితమే రావాణా ఆగిపోగా కూలీలు, షాపుల నిర్వాహకులలో మాత్రం కరోనా భయం వీడలేదు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ రంగంలో దిగి కూలీలకు, షాపుల నిర్వాహకులకు కరోనా నమూనాలు సేకరించింది. నెల్లూరు, గూడూరు మార్కెట్లలో ప్రస్తుతం 200 మందికిపైగా నమూనాలు సేకరించారు. వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వారిని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. కోయంబేడు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నెల్లూరు కూరగాయల మార్కెట్‌లోని కూలీలు, షాపుల నిర్వాహకులకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేసింది. 


పరీక్షలు చేస్తున్నాము..డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

జిల్లావ్యాప్తంగా కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న కూరగాయల మార్కెట్లలో కూలీలకు, షాపుల నిర్వాహకులకు కరోనా పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటికే నెల్లూరు, గూడూరు మార్కెట్లలో నమూనాలు సేకరించాము. నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రాంతాలలోను అనుమానితులకు పరీక్షిస్తున్నాం.  కరోనా జాగ్రత్తపై అవగాహన కల్పిస్తున్నాం. 



అన్ని జగ్రత్తలు తీసుకుంటున్నాం .. ఏసునాయుడు, నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

కోయంబేడు మార్కెట్‌లో అనేక మంది కరోనా వైరస్‌కు గురికావడంతో ముందస్తు జాగ్రత్తగా రవాణా ఆపేశాము. ఇక్కడ కూలీలు, షాపుల నిర్వాహకులు, మార్కెట్‌ కమిటీ కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షల చేయించాము. ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే ముందస్తు జాగ్రత్తగా మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశాం. 


Updated Date - 2020-05-10T07:27:42+05:30 IST