సగం నెల్లూరులోనే..

ABN , First Publish Date - 2020-07-19T11:11:47+05:30 IST

నెల్లూరు నగరం వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారుతోంది. ఏప్రిల్‌ నుంచి జూలై 17వ తేదీ వరకు నగర పరిధిలో మొత్తం

సగం నెల్లూరులోనే..

మొత్తం పాజిటివ్‌లు 2,203.. నగరంలోనే 1,143

వైరస్‌ హాట్‌స్పాట్‌గా సింహపురి

వణికిపోతున్న నగర ప్రజానీకం

వైర్‌సను కట్టడి చేయకుంటే పెనుప్రమాదమే

ప్రజల్లో అవగాహన అవసరం

అధికార యంత్రాంగంలోనూ మెలకువ అనివార్యం


నెల్లూరు నగరం గజగజలాడుతోంది. బతుకు తెరువు కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారే తప్ప క్షణక్షణం భయంతో వణికిపోతోంది. నగర పరిధిలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల పెరుగుదలను ఏదో రూపంలో కట్టడి చేయాలని అధికార యంత్రాంగాన్ని నగర ప్రజానీకం కోరుకుంటోంది. 


నెల్లూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు నగరం వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారుతోంది. ఏప్రిల్‌ నుంచి జూలై 17వ తేదీ వరకు నగర పరిధిలో మొత్తం 1,143 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 17 రోజుల్లో 831 మంది ఉన్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ 15వ తేదీ వరకు నగరంలో కేసుల సంఖ్య కేవలం 122 మాత్రమే. జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల వ్యవధిలో మరో 190 కేసులు వచ్చాయి. ఇక జూలై ఆరంభం నుంచి బాధితుల సంఖ్య శరవేగంగా పెరిగింది.


జూలై 6వ తేది 24 కేసులు, 7న 59, 8న 22, 9న 35, 10న 55, 11న 50, 12న 40, 13న 64, 14న 71, 15న 56, 16న 100, 17న 173 కేసులు రికార్డు అయ్యాయి. ఇంకా ఫలితాలు వెల్లడిరాని నమూనాలు 7వేల వరకు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా నెల్లూరు నగరానికి చెందిన వారివే. ఈ రిపోర్టుల కూడా వస్తే నగరానికి చెందిన బాధితుల సంఖ్య వేలల్లోకి చేరిపోతుంది. మరోవైపు మరణాలు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 52 మంది మృతి చెందగా, వీటిలో సగానికిపైగా నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. 


హాట్‌స్పాట్‌గా సిటీ

కరోనాకు జిల్లాలో నెల్లూరు సిటీ హాట్‌స్పాట్‌గా మారింది. జిల్లాలో ఇప్పటివరకు రికార్డు అయిన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,203. ఇందులో నగరానికి చెందిన కేసులు 1143. 


ఏదైనా చేయాలి

నగర పరిధిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కట్టడి కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు. తొలుత కొన్ని వర్గాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు అన్ని వర్గాలను కబళించివేస్తోంది. కరోనా దెబ్బకు కార్పోరేట్‌ ఆసుపత్రులు సైతం మూతపడిపోతున్నాయి. ఆసుపత్రి సిబ్బంది కరోనాతో వణికిపోతున్నారు. పోలీసులు కూడా ఈ వైరస్‌ బారిన పడుతుండటంతో  స్టేషన్లే మూతపడిపోతున్నాయి. కరోనా ఆరంభంలో ప్రజల్లో విస్తృతంగా తిరిగి సాయం అందించిన రాజకీయ నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు.


వీరికి, వీరి గన్‌మెన్లకు, సన్నిహితులకు వైరస్‌ ఎటాక్‌ కావడంతో దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.  పలువురు జర్నలిస్టులు వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ సమాజంలోని అన్ని వర్గాలను పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఏదో ఒక ప్రయత్నం చేయండని ప్రజలు కోరుకొంటున్నారు. పక్కనున్న చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు నగరాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాపార సమయాలను కుదించుకున్నారు. నెల్లూరు సిటీ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయం ఏదైనా ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేసులు ఎక్కువగా నమోదయిన  ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా బారికేడ్లు కట్టి వదిలేస్తున్నారు తప్ప మరే చర్యలు తీసుకోవడం లేదు.


పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది అటు వెళ్లగానే ప్రజలు ఈ బారికేడ్లను విప్పేసి యథావిధిగా తిరుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా కట్టడి పట్ల అధికార యంత్రాంగంలో గతంలో కనిపించిన శ్రద్ధ ఇప్పడు కనిపించడం లేదు. కేసులు.. మరణాల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే, పరిస్థితిని కాలానికి వదిలిస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా జిల్లా సారధ్య బాధ్యతలను చేపట్టిన కలెక్టర్‌ చక్రధర్‌బాబు నెల్లూరు సిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని  ప్రజలు కోరుకొంటున్నారు.  

Updated Date - 2020-07-19T11:11:47+05:30 IST