అడుగు ముందుకు పడేనా!?

ABN , First Publish Date - 2020-06-22T10:36:05+05:30 IST

ఏడాది కాలంగా జిల్లాలోని కీలకమైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో పురోగతి లేదు. గత ప్రభుత్వంలో టెండర్లు పూర్తయిన వర్కులను కొత్త

అడుగు ముందుకు పడేనా!?

ఏడాదిగా ఆగిపోయిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

కీలకమైన వాటికి రివర్స్‌ టెండర్లు 

పనుల ప్రారంభానికి కాంట్రాక్టర్ల నిరాసక్తి

బిల్లులు వస్తాయో.. రావో.. అనుమానం

పెన్నా బ్యారేజీకి రాని సీవోటీ అనుమతి


నెల్లూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఏడాది కాలంగా జిల్లాలోని కీలకమైన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో పురోగతి లేదు. గత ప్రభుత్వంలో టెండర్లు పూర్తయిన వర్కులను కొత్త ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి రివర్స్‌ టెండర్లు నిర్వహించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా టెండర్లు పూర్తయ్యాయి. ఇవి పూర్తయి  ఐదు నెలలు కావస్తోంది. వీటిలో కొన్నింటికి మాత్రమే అగ్రిమెంట్లు దశ దాటగా, మరికొన్ని టెండర్లతోనే నిలిచిపోయాయి.


పనుల రద్దు

ఆల్తూరుపాడు పనులు గత ప్రభుత్వంలోనే మొదలు కాగా రివర్స్‌ టెండరింగ్‌తో రద్దు చేశారు. ఆల్తూరుపాడు ప్రాజెక్టు, సోమశిల హైలెవల్‌ కెనాల్‌, చినక్రాక డైవర్షన్‌ కెనాల్‌, డీఆర్‌ - డీఎం చానెల్‌, సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ, మలిదేవి డ్రెయిన్‌ వంటి ప్రాజెక్టులకు ఇప్పటికే రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు పూర్తయ్యాయి. ఈ టెండర్ల చుట్టూ వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే జిల్లాలో లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు స్థిరీకరణ కూడా జరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఏ రకమైన పనులు చేసేందుకు వీలు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పనులు చేసుకునేందుకు అవకాశమున్నా ఈ ప్రాజెక్టుల పనుల్లో పురోగతి లేదు. 


ముందుకు రాని కాంట్రాక్టర్లు

టెండర్లు పూర్తయినా కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు కూడా ముందుకు రావడం లేదని ఇరిగేషన్‌ వర్గాలు అంటున్నాయి. అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్టర్లు కూడా పనులు మొదలుపెట్టేందుకు సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లులు అందుతాయో లేదోనన్న అనుమానం వారిలో నెలకొనడమే. ఇక మరో ప్రచారం కూడా జరుగుతోంది. పనులు మొదలు పెట్టాలంటే ముందుగా రహస్యంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంతో కొంత పర్సంటేజీ అధికార పార్టీ నేతలకు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సాహసం చేయడం మంచిదేనా.. అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు కాంట్రాక్టర్ల వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ ఏడాదైనా సాగేనా..?

ఈ పరిస్థితుల్లో రెండో ఏడాదైనా కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఏడాది అక్టోబరులోగా నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టర్‌ను మార్చి మిగిలిన వర్కుకు కొత్తగా ఇరిగేషన్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండరు పూర్తయిన నెల  గడుస్తున్నప్పటికీ ఇంత వరకు కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) నుంచి ఇంకా అనుమతి రాలేదు.


ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యానికి ఇక మిగిలింది నాలుగు నెలలు మాత్రమే. అయితే సీవోటీ నుంచి అప్రూవల్‌ ఎప్పుడు రావాలి? అగ్రిమెంట్లు ఎప్పుడు జరగాలి? పని ఎప్పుడు మొదలు పెట్టాలి? వంటి పలు సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితులు నెలకొనడం గమనార్హం. మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోకపోతే ఈ ఏడాది కూడా కీలక ప్రాజెక్టులకు మోక్షం లభించడం కష్టమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


Updated Date - 2020-06-22T10:36:05+05:30 IST