రేషన్‌ రాకెట్‌!!

ABN , First Publish Date - 2020-06-26T11:07:47+05:30 IST

రేషన్‌ బియ్యం మారు వ్యాపారం లాభసాటిగా మారడంతో జిల్లాకు చెందిన కొందరు దీనిని ఉపాధిగా ఎంచుకున్నారు. కొంతమంది

రేషన్‌ రాకెట్‌!!

పక్కదారి పడుతున్న ‘చౌక’ బియ్యం

ఇప్పుడిదో లాభసాటి వ్యాపారం

ఎన్నో చేతులు మారి మళ్లీ రేషన్‌ షాపులకే...

సీఎంఆర్‌ పేరుతో మిల్లర్ల మాయ

24 రోజుల్లో రూ.10 కోట్ల సరుకు స్వాధీనం

నిందితుల్లో అధికులు జిల్లా వారే!


తిరిగి తిరిగి చెయ్యి మళ్లీ నోటి వద్దకే వస్తుంది... అనే సామెతకు అద్దం పట్టేలా సాగుతోంది జిల్లాలో రేషన్‌ బియ్యం కుంభకోణం. పేదల ఆకలి తీర్చడం కోసం పంపిణీ చేస్తున్న రూపాయి కిలో బియ్యం వివిధ మార్గాల్లో పక్కదారి పట్టి తిరిగి మళ్లీ వినియోగదారుల చేతికే అందుతోంది. ఈ నెలలోనే విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.10 కోట్లకు పైమాటే. దీనిని బట్టి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద రాకెట్‌ నడుస్తోందని స్పష్టమవుతోంది. పట్టుబడిన బియ్యమే ఈ స్థాయిలో ఉంటే వెలుగులోకి రానివి ఇంకే స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.


నెల్లూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం మారు వ్యాపారం లాభసాటిగా మారడంతో జిల్లాకు చెందిన కొందరు దీనిని ఉపాధిగా ఎంచుకున్నారు. కొంతమంది ఆటోలలో గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ రేషన్‌ బియ్యం అవసరం లేని వారి వద్ద నుంచి కిలో రూ.10కి కొంటున్నారు. వీరు మరో దళారికి కిలో రూ.15 చొప్పున అమ్ముతున్నారు. రెండు, మూడు టన్నుల వరకు సేకరించిన ఆ రెండవ దళారి ఆ బియ్యాన్ని రూ.19 చొప్పున రైస్‌ మిల్లులకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్‌ డీలర్లే నేరుగా కార్డుదారుల నుంచి కిలో రూ.10కి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. వేలి ముద్ర వేసేసి కిలోకు పది రూపాయల చొప్పున డబ్బు తీసుకుని వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది డీలర్లు స్టాకు లిఫ్టింగ్‌ సమయంలోనే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనే కొంత సరుకు అమ్ముకుంటున్నారు. వారి పరిధిలో బియ్యం ఎవరికి అవసరం లేదో ముందే తెలుసు కాబట్టి ఆ మేరకు బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనే విక్రయించేస్తున్నారు.


ఇలా పోగుచేసిన బియ్యం పెద్ద మోతాదులో రైస్‌ మిల్లులకు చేరుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి జిల్లాకు చెందిన కొన్ని రైస్‌మిల్లులు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నాయి. సీఎంఆర్‌ కింద రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుచేసి మిల్లులకు పంపుతున్న విషయం తెలిసిందే. ప్రతి వంద కిలోల వరి ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున మిల్లర్లు సివిల్‌ సప్లయ్స్‌కు ఇవ్వాలి. వివిధ రూపాల్లో బయట దళారుల నుంచి వచ్చిన రేషన్‌ బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి తిరిగి బస్తాల్లో నింపి పీడీఎస్‌ రైస్‌గా సివిల్‌ సప్లయ్స్‌కు అందజేస్తున్నారు.  ఉదాహరణకు 6.7 టన్నుల బియ్యం సివిల్‌ సప్లయ్స్‌కు ఇవ్వడం ద్వారా సీఎంఆర్‌ కింద మిల్లుకు చేరిన 10 టన్నుల వరి ధాన్యం మిల్లర్లకు ఆదా అవుతుంది. ఆ వరి ధాన్యాన్ని వీరు బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారు. దీనివల్ల వీరికి మిల్లింగ్‌  ఖర్చు తగ్గుతుంది, బహిరంగ మార్కెట్‌లో వరి ధాన్యం అమ్ముకోవడం వల్ల లాభాలూ వస్తాయి.

 

అక్రమార్కుల్లో జిల్లా వారే అధికం

ఈ రైస్‌ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 42 మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో అత్యధికులు జిల్లాకు చెందిన వారే. ఇప్పటికే రెండు, మూడు సార్లు అరెస్ట్‌ అయిన వారు కూడా ఉన్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలల కోటా వెంట వెంటనే ఇవ్వడం, సీఎంఆర్‌ ధాన్యం కొనుగోలు సీజన్‌ కావడంతో బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. 


ఎక్కడెక్కడ ఎంతెంత!?: జిల్లాలో ఈ నెల 1 నుంచి 24వ తేదీ వరకు...

కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లక్ష్మీనరసింహా రైస్‌ మిల్లులో 815 బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

కావలి కృష్ణసాయి రైస్‌ మిల్లులో 729.515 మెట్రిక్‌ టన్నులు.  

ఇందుకూరుపేట రామకృష్ణ రైస్‌ ఇండ్రస్ర్టీ్‌సలో 1503 బస్తాలు

బుచ్చి వద్ద ఆటోలో 810 బ్యాగులు.

కావలి ప్రసాద్‌ ట్రేడర్స్‌లో 170 బస్తాలు. 

నెల్లూరు నగరం ఎఫ్‌పీ షాపులో 25 బస్తాలు.  

సూళ్లూరుపేట మేదరమిట్టలోని ఒక ఇంట్లో 30.415 టన్నులు. 

అల్లీపురం ఎస్‌వీకేపీ రైస్‌ ఇండ్రస్ట్రీ్‌సలో 459.1 మెట్రిక్‌ టన్నులు. 

కృష్ణపట్నం పోర్టులో  శ్రీ వీరభద్ర రైస్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన 16.449 టన్నులు. 


ఇలా విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు మొత్తం 18,905.7 మెట్రిక్‌ టన్నుల  రేషన్‌ బియ్యం సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.10.42 కోట్లుగా లెక్కకట్టారు. మొత్తం 42 మందిని అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2020-06-26T11:07:47+05:30 IST