ఎన్టీఆర్‌ను అవమానపర్చారు!

ABN , First Publish Date - 2020-07-19T11:09:29+05:30 IST

తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పోలీసులు దగ్గరుండి వైసీపీ నాయకుల చేత ధ్వంసం చేయించి ఎన్టీఆర్‌ను

ఎన్టీఆర్‌ను అవమానపర్చారు!

కావలిలో రౌడీరాజ్యాన్ని నడిపిస్తున్న డీఎస్పీ

చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదు

విగ్రహం తొలగింపుపై ఎమ్మెల్సీ బీద ఆగ్రహం


కావలి, జూలై 18 : తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పోలీసులు దగ్గరుండి వైసీపీ నాయకుల చేత ధ్వంసం చేయించి ఎన్టీఆర్‌ను అవమానపరిచారని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శనివారం ధ్వంసం చేశారనే విషయం తెలుసుకున్న రవిచంద్ర, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అజీజ్‌తో కలిసి ముసునూరుకు చేరుకున్నారు.


అప్పటికే విగ్రహం ధ్వంసం కార్యక్రమం కొనసాగుతుండటం అక్కడ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించి ఉండటంతో బీద రవిచంద్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిలో డీఎస్పీ రౌడీరాజ్యాన్ని నడిపిస్తున్నారని, ఈయన అరాచకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి, ఆయనపై చర్యలు తీసుకునే వరకు వదిలే ప్రసక్తిలేదని అన్నారు. విగ్రహం వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉందని అధికారులు చెపితే దానిని తామే తొలగించేవారమన్నారు.


గతంలో విగ్రహం తొలగిస్తారనే విషయాన్ని అప్పటి సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా డీఎస్పీ అందరితో సమావేశం ఏర్పాటుచేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు డీఎస్పీ మద్దతుతో వైసీపీ నాయకులు ధ్వంసం చేయటం దుర్మార్గపు చర్య అన్నారు. డీఎస్పీకి వైసీపీ మీద అభిమానం ఉంటే ఖాకీ డ్రస్‌ తీసేసి ఆ పార్టీలో చేరి సేవచేయాలే కాని టీడీపీ నేతలను వేధించటం సరికాదన్నారు. ఆయన వెంట విగ్రహకమిటీ నాయకులు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.


వైసీపీ అరాచకాలకు పరాకాష్ట

ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగించటం రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు, విధ్వంసాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. తెలుగుజాతి ముద్దు బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైసీపీ నాయకులు పట్టపగలు తొలగించటం దుర్మార్గమన్నారు.


యథాస్థానంలో ప్రతిష్ఠించాలి

కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపుపై ఎన్టీఆర్‌ అఖిల భారత అభిమానుల సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి రమే్‌షరెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వెంటనే యథాస్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్‌  చేశారు.

Updated Date - 2020-07-19T11:09:29+05:30 IST