ఇవేమి రివర్స్ టెండర్లో.. ? ప్రతి దానిలోనూ వివాదమే..
ABN , First Publish Date - 2020-12-14T04:10:21+05:30 IST
‘గతంలో మాదిరిగా కాకుండా ఇకపై ప్రతి వర్కుకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం.. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచు తాం. దీని ఫలితంగా పారదర్శకత పెంచడంతోపాటు ప్రభు త్వానికి ఖర్చు మిగులుస్తాం’.. - ఇవి ప్రభుత్వం చెప్పిన మాటలు

కాంట్రాక్టర్లపై అధికార పార్టీ నేతల పెత్తనం
వారు చెప్పిన వారికే దక్కాలనే ప్రయత్నం
మొదట బీజీల అడ్డగింత.. తర్వాత బెదిరింపులు
చితికిపోతున్న చిన్న కాంట్రాక్టర్లు
నెల్లూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) :
‘గతంలో మాదిరిగా కాకుండా ఇకపై ప్రతి వర్కుకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం.. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచు తాం. దీని ఫలితంగా పారదర్శకత పెంచడంతోపాటు ప్రభు త్వానికి ఖర్చు మిగులుస్తాం’..
- ఇవి ప్రభుత్వం చెప్పిన మాటలు
అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంది. టెండర్లు తమకే సొంతమన్నట్లు కొంత మంది అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిన కాంట్రాక్టర్‌కే టెండర్ దక్కాలి. ఎవరు ఎక్కువ పర్సంటేజీ ఇస్తే వారికే వర్కు. మరొకరు టెండర్ వేయడానికి వీల్లేదు. ఒకవేళ తెలియకుండా వేసిన వారు రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనకూ డదు. ఎవరన్నా ధిక్కరించి పాల్గొంటే ఎలా పనులు చేస్తారో నంటూ బెదిరింపులు.. ఇవీ టెండర్ల సమయంలో కనిపిస్తున్న, దృశ్యాలు. ఈ దెబ్బకు కాంట్రాక్టర్ల వ్యవస్థ కుదేలవుతోంది. మరోవైపు ప్రభుత్వ ఖజానాపై అవనపు భారం పడుతోంది. రివర్స్ టెండరింగ్ నిర్వహించిన మొదట్లో కొన్ని వర్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఆ వర్కులు భారీ లెస్‌కు వెళ్లాయి. అయితే తర్వాత జరిగిన టెండర్లను పరిశీలిస్తే ఆ స్థాయిలో లెస్‌కు వెళ్లిన సందర్భాలు లేవు. చాలా చోట్ల ఎక్సెస్‌కే టెండర్లు దక్కుతున్నాయి. తెరవెనుకే నయానో, భయానో ‘రింగ్’ జరు గుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం అనుకున్న పారదర్శకత, మిగులు కాస్తా ‘రివర్స్’ అయిపోతోంది. తద్వారా ఖజానాకు భారం పెరగడంతో పాటు వర్కులో కూడా నాణ్యత తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలుత ఇరిగేషన్ టెండర్లు..
రాష్ట్రంలోనే మొదటగా ఇరిగేషన్ వర్కులకు జిల్లాలో టెండర్లు జరిగాయి. ఆ సమయంలో పలువురు అధికార పార్టీ నేతలు రివర్స్ టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనకుండా బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లు అధికారులకు ఇవ్వనీయకుండా అడ్డుకు న్నారు. ఈ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచు రించడంతో ఒక్క సంబంధిత అధికారి కార్యాలయంలోనే కాకుండా ఆపై అధికారులు, కలెక్టర్ కార్యాలయం వంటి ఐదు చోట్ల బ్యాంకు గ్యారెంటీలను సమర్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కూడా కాంట్రాక్టర్లకు అడ్డం కులు ఎదరవుతుండడంతో బీజీలను నేరుగా ఇవ్వకపోయినా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వాటినే పరిగణలోకి తీసుకునే విధంగా మళ్లీ ఉత్తర్వులిచ్చింది. అయినా అధికార పార్టీ నేతలు టెండర్ల విషయంలో కొత్త దారులు వెతుక్కుంటూనే ఉండడం గమనార్హం. జిల్లాలో నిర్వహిస్తున్న దాదాపుగా ప్రతీ టెండర్ వివాదాలకు నిలయంగా మారుతోంది. టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత సులభంగా టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు ఎవరన్నది తెలిసిపోయే అవకాశముంది. ఈ క్రమంలో వెంటనే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు లేకుండా ఎక్కువ లెస్‌కు టెండర్ వెళ్లే వీలుంటుంది. కానీ ఇప్పుడు అధికార పార్టీ నేతలు త్వరగా రివర్స్ టెండరింగ్ నిర్వహించకుండా అడ్డుకుంటూ ‘రింగ్’కు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటీవల జరుగుతున్న వ్యవహారాలే ఇందుకు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆఖరుకు చిన్న చిన్న వర్కులను కూడా వదలకపోతుండ డంతో చిన్న కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. జిల్లాలో దాదాపు రూ.400 కోట్ల వరకు బిల్లులు కాంట్రాక్టర్లకు అందాల్సి ఉంది. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ రెండేళ్లలో తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు రెట్టింపయ్యాయని వాపోతున్నారు. రావాల్సిన బిల్లులు అటుంచితే కనీసం కొత్త వర్కులైనా చేసి ఎంతో కొంత బయటపడదామని అనుకుంటే ఇక్కడ కూడా ఎదురుదెబ్బలే తగులుతున్నాయని చిన్న కాంట్రాక్టర్లు కుమిలిపోతున్నారు.
ఆల్తూరుపాడు ప్రాజెక్టు, చినక్రాక డైవర్షన్ కెనాల్ నిర్మాణాలకు మొదట జిల్లాలో టెండర్లు పిలవగా వాటికి కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. దాదాపు రూ.300 కోట్లతో పిలిచిన ఆ టెండర్లు 20 శాతానికి పైగా లెస్‌కు వెళ్లాయి. అయితే ఆ తర్వాత సుమారు రూ.88 కోట్లతో సర్వేపల్లి కాలువ అభివృద్ధికి పిలిచిన టెండర్లలో ఐదుగురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ ఐదుగురు బీజీలు ఇచ్చినప్పటికీ ఒక కాంట్రాక్టర్ ఎందుకో తన బీజీ వెనక్కు తీసుకున్నారు. మిగిలిన నలుగురు కాంట్రాక్టర్లూ రివర్స్ టెండరింగ్‌కు అర్హత సాధించినప్పటికీ ఎవరూ అందులో పాల్గొనకపోవడం గమనార్హం. దీంతో ఎల్1 కాంట్రాక్టర్‌కే వర్కు దక్కింది.
మలిదేవి డ్రెయిన్ అభివృద్ధికి గతేడాది రూ.72 కోట్లతో టెండర్లు పిలవగా మొత్తం ఆరుగురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. అయితే రివర్స్ టెండరింగ్‌లో మాత్రం ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనడం గమనార్హం. అందులో ఒక కాంట్రాక్టర్ మాత్రం 0.5 శాతం తక్కువకు మార్చారు. ఆ కాంట్రాక్టర్‌కే వర్కు దక్కింది. అయితే ఈ టెండర్ల సమయంలో కొందరు కాంట్రాక్టర్లు తమ బీజీలు అధికారులు తీసుకోలేదని, తద్వారా తమకు రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని అభియోగిస్తూ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఎన్‌డీబీ కింద సుమారు రూ.90 కోట్లతో పలు రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల నిబంధనలు కొందరికి మేలు చేసేలా ఉన్నాయంటూ పలువురు కాంట్రా క్టర్లు ఆరోపణలు చేశారు. తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనా లు ప్రచురించడంతో టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచారు. ఇప్పుడు కూడా రెండు వారాలు గడుస్తున్నా వీటికి ఇంకా రివర్స్ టెండరింగ్ నిర్వహించలేదు. అలానే రూ.41 కోట్లతో అక్టోబరులో పిలిచిన టెండర్‌కు నెల తర్వాత రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ వర్కు ఎక్సెస్‌కు వెళ్లడం గమనార్హం.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిప్, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.వంద కోట్లపై వర్కులకు టెండర్లు పిలిచారు. అయితే వీటిని ఎక్కువ పర్సంటేజీకు అమ్ముకు న్నారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీసీ రోడ్ల నిర్మాణాలకు క్యూబిక్ మీటర్‌కు సిటీ నియోజకవర్గం పరిధిలో ఒక ధర, రూరల్ నియోజకవర్గంలో మరో ధర నిర్ణయించడం తో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిందన్న విమర్శలున్నా యి. తర్వాత ఇళ్ల స్థలాల లెవలింగ్‌కు సంబంధించిన టెండర్లు కూడా ముందుగా ఒప్పందం ప్రకారమే వేరొకరిని టెండర్ వేయనీయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి.